ఉమ్మడి పాలనలో తాగునీటికి తండ్లాట.. వేసవి వచ్చిందంటే ఖాళీ బిందెలతో కొట్లాట.. కిలోమీటర్లు నడిచి వెళ్తే బిందెడు నీళ్లు దొరికే గడ్డుకాలం.. ఒక్క పంట పండటమే గగనం.. ఇదంతా నాటి మానుకోట దుస్థితి.. మరి బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో నేడు ఇంటి ముందు నల్ల విప్పితే స్వచ్ఛమైన తాగునీటి జలాలు.. మండు వేసవిలో మత్తళ్లు దుంకుతున్న చెరువులు.. 24 గంటలపాటు కరెంట్, పుష్కలమైన సాగు నీటితో సమృద్ధిగా పంటలు.. జిల్లా ఏర్పాటుతో చేరువైన పరిపాలన. ఇలా అన్ని రంగాల్లో నాటి మానుకోట.. నేడు మణులకోటగా మారింది.
మహబూబాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అకడే అన్న చందంగా ఉన్న మహబూబాబాద్ (మానుకోట) బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో అనూహ్యంగా అభివృద్ధి చెందింది. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రోడ్లు, విద్యుత్తు ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. ఉమ్మడి పాలనతో పోలిస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 1000 రెట్ల అభివృద్ధి జరిగింది. జిల్లా కేంద్రంగా మారడంతో పాలన ప్రజలకు మరింత చేరువైంది.
మహబూబాబాద్‌లో రూ.62 కోట్లతో కలెక్టరేట్ భవన సముదాయం, రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, రూ. 20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మారెట్, రూ.3 కోట్లతో ఆధునిక హంగులతో జిల్లా గ్రంథాలయం వంటివి నిర్మించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం, మహబూబాబాద్ మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకొని త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇలా ఒక మానుకోట మున్సిపాలిటీకే రూ.200 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేశారు. రోడ్ల విస్తరణతోపాటు జంక్షన్ల ఏర్పాటుతో మహబూబాబాద్ కొత్త అందాలు సంతరించుకున్నది.
మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుపడి సాగునీటి వసతి పెరిగి సిరులు పండుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రూ.7 కోట్లతో మదనతుర్తి వద్ద బ్రిడ్జి, అనేక చోట్ల విద్యుత్తు ఉప కేంద్రాలు నిర్మించారు. ప్రతితండాకు, ప్రతి గ్రామ పంచాయతీకి తారురోడ్లు, సీసీ రోడ్లు వేశారు. కేసముద్రం మండల కేంద్రంలో రూ.16 కోట్లతో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, మహాత్మా జ్యోతిబాపూలే, టీఎస్ మాడల్ పాఠశాలలను నిర్మించారు. నియోజకవర్గ కేంద్రంతోపాటు అన్ని మండలాల పరిధిలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మించారు. నియోజకవర్గంలో 22 చెక్‌డ్యాంలు నిర్మించడంతో ఏడాదంతా కిలోమీటర్ల మేర నీరు నిలిచి రైతులకు ఎంతో మేలు కలుగుతున్నది.