వరంగల్ : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. పల్లె ప్రగతితో చిన్నచిన్న గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం కాట్రపల్లెలో మంత్రి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. మోటర్ సైకిల్ మీద ప్రయాణించారు.
అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యం, మురుగునీటి కాలువలు, మిషన్ భగీరథ మంచినీటి సరఫరా వంటి పలు అంశాలను పరిశీలించి, గ్రామస్తులతో మంత్రి మాట్లాడారు. గ్రామంలో రూ.4 లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
గ్రామ యూత్ తో కలిసి వాలీబాల్ ఆడారు. గ్రామంలో కోటి రూపాయలతో చేపట్టిన అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, కాట్రపల్లి నుంచి రేగుల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ని మంత్రి ప్రారంభించారు.
మన ఊరు మన బడి కింద గ్రామ పాఠశాల ఆధునీకరణకు రూ.83 లక్షలతో శంకుస్థాపనలు చేశారు. గ్రామంలో సఫాయి కార్మికులతో కలిసి చెత్త ఎత్తి ట్రాక్టర్ లో పోశారు. అలాగే గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామ పాఠశాలలో జరిగిన పల్లె ప్రగతి లో మంత్రి గ్రామ అభివృద్ధి మీద సమీక్ష చేశారు. 38 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద 3 కోట్ల 5 లక్షలు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రంలోని బిజేపీ కుట్రలు చేస్తుంది. కేసీఆర్ గొంతులో ప్రాణం ఉండగా రైతులకు నష్టం జరుగదన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.