మంచిర్యాల, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మేం ఉన్నాం తెలంగాణ ఉద్యమంలా.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోడు.. కాంగ్రెసోడు మాట్లాడుతున్నడు. కానీ వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదు’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో గురువారం రాష్ట్రంలోనే మొదటిసారి నిర్వహించిన చెన్నూర్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజానీకం పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నట్టు తెలిపారు. రాష్ట్రం తెచ్చినమనే నమ్మకంతోనే 2014లో ఒంటరిగా పోటీ చేసినా ప్రజలు 63 సీట్లతో బీఆర్ఎస్కు అధికారం ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2018లో చేసిన అభివృద్ధి చూసిన ప్రజలు 88 సీట్లతో ఆశీర్వదించినట్టు చెప్పారు. ఇప్పుడు పదేండ్ల ప్రగతి ప్రస్తావనతో ప్రజల దగ్గరికి పోతున్నామని, ఈ సారి 100 సీట్లతో తమను అశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను 100 సీట్లతో నిలబెడతారని అన్నారు.
సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి, పట్టుదల, దార్శనికతను తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నదని చెప్పారు. యావత్ దేశమే తెలంగాణ ప్రగతిని కొనియాడుతుందని అన్నారు. చాలా రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో, ఐటీ ఎగుమతుల్లో, నీలి, హరిత, క్షీర విప్లవం, ఎల్లో, పింక్ విప్లవంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నట్టు తెలిపారు. కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేసుకున్నామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కరువు నేల, వలసల నేలైనా పాలమూరు ప్రజల పాదాలు కడగడానికి, వారి నారు మడుల్లోకి కృష్ణమ్మ నీళ్లను మళ్లించే కార్యక్రమానికి ఈ నెల 16న సీఎం కేసీఆర్ అంకురార్పణ చేయనున్నారని తెలిపారు. ఇవన్నీ కూడా ప్రజల కండ్ల ముందున్నాయని, అందుకే ముచ్చటగా మూడోసారి బ్రహ్మాండంగా వంద సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని మరింత ప్రగతిలోకి తీసుకుపోవడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.