Minister Srinivas Yadav | తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో దేవాలయాలు ఎంతో అభివృద్ధి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎస్పీరోడ్లోని హనుమాన్ ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు, అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత నూతన పాలకమండలి సభ్యులతో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం పాలకమండలి సభ్యులు కృషి చేయాలని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు.
బల్కంపేట, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, అమీర్ పేటలోని కనకదుర్గమ్మ దేవాలయం, గణేశ్ దేవాలయం ఇలా అనేక దేవాలయాల లో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. చరిత్రలోనే గొప్పగా నిలిచిపోయేలా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి, బేగంపేట డివిజన్ BRS అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శేఖర్ పాల్గొన్నారు.