హైదరాబాద్ సూపర్..
తెలంగాణ ప్రగతి అద్భుతం..
ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి..
తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్..
Chandrababu Naidu | ‘తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా ఉంది.. ఇవీ రెండుకళ్ల సిద్ధాంతకర్త, తెలంగాణ పద నిషేధ నేత శ్రీమాన్ చంద్రబాబు గారు మరోసారి చేసిన వ్యాఖ్యలు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవేవో తెలంగాణ మీద ప్రేమతోనో, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అభిమానంతోనో అన్నారనుకుంటే పొరపాటే. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి కూడా అప్పుడెప్పుడో 20 ఏండ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను వేసిన పునాదుల ఘనతేనని చెప్పుకోవడానికి ఆయన ఈ సరికొత్త పాచికను పన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఐదేండ్లలో ఏమీ చేయలేని అసమర్థతను, అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్నీ కట్టలేని తన చేతకానితనాన్ని దాచుకోవడానికి చంద్రబాబు.. కేసీఆర్ సాధించిన ప్రగతిని తన గొప్పతనంగా చాటుకునే పిచ్చి ప్రయత్నం పదే పదే చేస్తున్నారు.
తెలంగాణను చూపించి తనపై మరకను తుడిపేసుకునే ఎత్తుగడే కాదు; జగన్‌పైకి ఆంధ్రా ఓటర్లను రెచ్చగొట్టే కుట్ర కూడా ఈ మాటల వెనుక దాగిఉంది. చంద్రబాబు దిగిపోయి, తెలంగాణతో సంబంధాలు తెగిపోయి 20 ఏండ్లు గడుస్తున్నాయి. చంద్రబాబు అంత ఘనుడే అయితే ఆయన 9 ఏండ్ల పాలనలో భూముల ధరలు ఎందుకు పెరగలేదు. తలసరి ఎందుకు వృద్ధి కాలేదు. హైదరాబాద్ ఎందుకు అభివృద్ధి చెందలేదు. ఆ తర్వాత వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రుల 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు విజన్ ఫలితాలు ఎందుకు కనిపించలేదు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించినట్టు ఉన్నది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు. తెలంగాణ తనవల్లే అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌కు పురుడు పోసిందే తాను అని గతంలో గప్పాలు కొట్టిన ఆయన.. మరోసారి అవే మాటలు వల్లెవేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనవల్లే తెలంగాణ నేడు ఈ స్థాయిలో ఉన్నదని చెప్పుకొన్నారు. 400 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌కు, తానే రూపకల్పన చేసినట్టు గొప్పలు చెప్పుకొన్నారు. తాను మొదలుపెట్టిన అభివృద్ధిని ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ముందుకు తీసుకుపోవటంతో నేడు తెలంగాణ, హైదరాబాద్ ఈ స్థాయిలో ఉన్నాయని గొప్పలు పోయారు. ‘హైదరాబాద్ ఇప్పుడు అంత అద్భుతంగా ఉన్నదంటే ఎవరు కారణం? నేనే.. హైదరాబాద్ అభివృద్ధికి ఫౌండేషన్ వేసిందే నేను. ఒక ఐటీ, ఒక బయోటెక్నాలజీ, ఒక ఫార్మా, ఒక ఫైనాన్స్.. హైదరాబాద్ అభివృద్ధికి కావాల్సిన పునాదులన్నీ నేనే వేశాను. ఇప్పుడు హైదరాబాద్ నగరం దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదంటే నాడు నేను చేసిన అభివృద్ధే కారణం. నేడు తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్.. ఆ రోజు నేను వేసిన పునాదివల్లే ఇప్పుడు తెలంగాణ ఆ ఘనత సాధించింది. ఇప్పుడు తెలంగాణకు, ఆంధ్రాకు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాకు ఉన్నంత తేడా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఇటీవల ఎకరం రూ.100 కోట్లు పలికింది. అదే రూ.వంద కోట్లు ఏపీలో ఖర్చు పెడితే ఎన్ని ఎకరాల భూమి కొనుక్కోవచ్చో ఊహించుకోండి. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండుమూడు ఎకరాలు కొనేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో వందల ఎకరాలు కొనుక్కొనే స్థితికి వచ్చింది. ఇది ఎలా వచ్చింది? నేను ఆ రోజు వేసిన పునాదివల్ల!’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబు గతంలోనూ ఇలాగే గప్పాలు కొట్టారు. హైదరాబాద్‌కు పునాది వేసిందే తాను అని ప్రకటించేసుకొన్నారు. అదే నిజమైతే ఉమ్మడి ఏపీ విభజింపబడిన తర్వాత కొత్త ఏపీకి మొదటి సీఎం ఆయనే అయ్యారు కదా! ఎంత అభివృద్ధి చేశారు? రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లయినా ఇప్పటికీ ఏపీకి కచ్చితమైన రాజధాని అంటూ లేదు.. చంద్రబాబు అంత గొప్ప నాయకుడే అయితే ఐదేండ్లపాటు అధికారంలో ఉండి రాజధానిని ఎందుకు కట్టలేదు? తెలంగాణ తలసరి ఆదాయం నేడు దేశంలో నంబర్ వన్‌గా ఉండటానికి తానే కారణమని బాబు చెప్పుకొన్నారు. చంద్రబాబు తర్వాత పదేండ్లపాటు ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ పాలించింది. బాబు అంతగొప్పగా పునాదులు వేస్తే నాడు తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదు? ప్రతిసారీ జీనోమ్ వ్యాలీ తన ఘనతే అని ఆయన చెప్పుకొంటున్నారు. హైదరాబాద్‌కు కోకాపేట, జీనోమ్‌వ్యాలీ పూర్తిగా విరుద్ధ దిశల్లో ఉంటాయి. మరి జీనోమ్‌వ్యాలీ వల్ల కోకాపేట భూములకు ధర ఎలా పెరిగింది. నిజానికి చంద్రబాబు ఎప్పుడూ ఒక విఫల పాలకుడిగానే మిగిలిపోయారు.
ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అని రైతుల ఉసురు పోసుకొన్నారు. ఆయన విధానాలవల్లే తెలంగాణలో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. ఆ కొడి కాంగ్రెస్ పాలనలో కూడా కొనసాగింది. ప్రస్తుత ఏపీకి మొదటి సీఎంగా అవకాశం ఇచ్చినా విఫల పాలకుడిగానే మిగిలిపోయారు. ఆంధ్రులకు రాజధాని లేకుండా చేశారు. అధికారంలో ఉన్న ఐదేండ్లూ కాగితాలపై అందమైన బొమ్మలు చూపించి ఇదే మీ రాజధాని అని ఆంధ్రులను నమ్మించారు. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, ఏపీ సీఎం జగన్‌పై అక్కసు వెళ్లగక్కేందుకే లేని గొప్పలు చెప్పుకొని నవ్వులపాలవుతున్నారు. ఇదంతా ఏపీ ప్రజలను ఏమార్చే ఎత్తుడగ అని అక్కడి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో తెలియనివారెవరు? స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దార్శనిక పాలనలోనే అభివృద్ధి విప్లవం వచ్చిందని ఇప్పటికే ఎంతోమంది మేధావులు ప్రశంసించారు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించటంతోపాటు సర్వతోముఖాభివృద్ధివైపు రాష్ర్టాన్ని నడిపించటం వల్లనే నేడు దేశానికి మార్గదర్శకంగా మారిందని కొనియాడారు. చంద్రబాబు మాటల్లో అంతర్లీనంగా తెలంగాణ అభివృద్ధిపై అక్కసు కనిపిస్తున్నది.
చంద్రబాబు తీరు చూస్తుంటే ఇత్తేసి పొత్తు కూడినట్టుగా ఉన్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అహోరాత్రులు కష్టపడి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపారు. ఈ ఫలంలో వాటా కోసం బాబు వెంపర్లాడుతున్నట్టు కనిపిస్తున్నది. గతంలో కూడా బాబు హైదరాబాద్ అభివృద్ధిపై ఇలాంటి మాటలే చెప్పారు. గత జూన్ 19న, జూలై 25న, ఆగస్టు 6న పలు సందర్భాల్లో హైదరాబాద్ అభివృద్ధి గురించి గొప్పగానే చెప్పారు. ఆయన ప్రకటనలకు మీడియా కూడా భారీగానే ప్రచారం కల్పించింది. ఇది చూసి చంద్రబాబుకు తెలంగాణపై ఎంతప్రేమో! అనుకొన్నవారు కూడా ఉన్నారు. కానీ, అసలు విషయం వేరే ఉన్నది. ప్రజలను గందరగోళపర్చి అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ మంచి మార్కులు కొట్టేసే ఎత్తుడగ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకొంటూనే.. అందులో తన పాత్ర కూడా ఉన్నదని చెప్పుకోవటమే బాబు వ్యూహమని చెప్తున్నారు. చంద్రబాబు ఏం చేసినా వాటి వెనుక స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.