శాయంపేట, మార్చి 11 : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల పంప్‌హౌస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్మసాగర్‌కు నీటి పంపింగ్ బంద్ చేయాలని డిమాండ్ చేస్త్తూ ఆందోళన చేపట్టారు. చలివాగులో 15 అడుగుల మేర నీటిమట్టం పెరిగే వరకు మోటార్లు బంద్ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు బిల్లులివ్వక చలివాగు ప్రాజెక్టులోకి నెల రోజులపాటు నీటి పంపింగ్ జరుగలేదని, దాంతో నీటి సమస్య తీవ్రమై పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అంతకుముందు దేవాదుల సీఈ అశోక్‌కుమార్‌కు ఫోన్ చేసి గండ్ర మాట్లాడారు.
ప్రాజెక్ట్‌లో కనీసం 15 అడుగుల నీటిమట్టం ఉంచిన తర్వాతే ధర్మసాగర్‌కు నీటి పంపిణీ చేయాలని సూచించారు. ఇక్కడి పంట పొలాలను ఎండబెట్టి అక్కడికి నీటిని తీసుకెళ్లాలని చూస్తే చూస్తూ ఊరుకోమని, మోటర్లు బంద్ పెడతామని హెచ్చరించారు. ఇక్కడికి ఈఈని పంపి హామీ ఇప్పించాలని సూచించారు. కొద్ది సేపటికి ఈఈ సునీత వచ్చి ఆరు రోజుల్లో పదిహేను అడుగుల మేర నీటిని ఉంచుతామని చెప్పడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మేకల శ్రీనివాస్, దైనంపల్లి సుమన్, శ్యాం సుందర్‌రెడ్డి, ప్రసాద్ తదితర్లు పాల్గొన్నారు.