హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దేవాదాయ శాఖ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. షామియానాలు, తాగునీటి సౌకర్యం, చిన్న పిల్లలకు పాలిచ్చేందుకు లాక్టేషన్ గదులు, వృద్ధులు, వికలాంగులకు వీల్ఛైర్లు, క్యూ కాంప్లెక్స్‌ల వద్ద షెడ్లు తదితర వసతులు కల్పిస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు అసౌకర్యం కలుగకుండా వేసవిలో తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఇచ్చిన తాజా ఆదేశాల మేరకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు ఎండకు ఎండకుండా, కాళ్లు కాలకుండా, వానకు తడవకుండా ఆధునిక జర్మన్ హాంగర్ షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తన మాడవీధిలో 23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్ ఏర్పాటు వల్ల స్వామివారి దర్శనం అనంతరం భక్తులు సేదదీరేందుకు సౌకర్యం కలిగింది. క్యూలైన్ల వద్ద లాక్టేషన్ గదులు, మంచినీటి నల్లాలు, సీటింగ్ సౌకర్యం, క్యూ కాంప్లెక్స్ వద్ద ఏసీ సామర్ధ్యం పెంపు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రోటోకాల్ విభాగం వద్ద వీల్ఛైర్లు, టికెట్ కౌంటర్ నుంచి క్యూకాంప్లెక్స్ వరకు షెడ్ల ఏర్పాటు తదితర సౌకర్యాలను కల్పించారు.