Devadala Project | వరంగల్, మార్చి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రుల హడావుడితో ఆన్ కాలేకపోయిన దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పంపుల పరిస్థితి ఇంకా అలాగే ఉన్నది. బుధవారం రాత్రి వరకు పంపులు ఆన్ కాలేదు. మరో రెండు రోజుల వరకు పంపులు ఆన్ అయ్యే పరిస్థితి లేదని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. దేవాదుల ప్రాజెక్టు మూదో దశలోని దేవన్నపేట పంప్‌హౌస్‌లో మోటర్లను ఆన్ చేసేందుకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం వచ్చారు.
ఆన్ కాకపోవడంతో మోటర్లు ఆన్ అయ్యే వరకు వరంగల్‌లోనే ఉంటామని, ఆన్ చేసిన తర్వాతే వెళ్తామని ప్రకటించారు. రాత్రి 12 గంటల వరకు నిట్ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారు. పంపులు ఆన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో చేసేది లేక హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మంత్రులు హైదరాబాద్‌కు వెళ్లడంతో సాగునీటి శాఖ అధికారులు పంపులను ఆన్ చేసే ప్రక్రియ నెమ్మదించింది. దేవన్నపేట పంపుహౌస్‌లోని మోటర్లు ఎప్పటి వరకు ఆన్ ఆవుతాయనేది సాగునీటి శాఖ అధికారులే చెప్పలేకపోతున్నారు. మంత్రులు అడిగినందుకు రెండుమూడు రోజులు అని చెప్పామని, సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తేనే మోటర్లు ఆన్ అవుతాయని అంటున్నారు.
సాగునీటి సరఫరా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి దేవన్నపేట పంపుహౌస్ మోటర్ల ప్రారంభ ప్రక్రియ పెద్ద ఉదాహరణగా నిలిచింది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పంటలకు సాగునీరు అందించేందుకు దేవన్నపేట పంప్‌హౌస్ మోటర్లను ఆన్ చేయాల్సి ఉన్నది. పంపులను రన్ చేసే విషయంలో సాగునీటి శాఖ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే నేరుగా మంత్రులు రావడం వింతగా ఉన్నది. మంత్రులు వచ్చి మోటర్లు ఆన్ చేస్తే పంటలు పండుతాయని ఆశించిన రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
దేవాదుల ప్రాజెక్టు మూడో దశ కింద రామప్ప చెరువు నుంచి ఉనికిచర్ల వరకు టన్నెల్, దేవన్నపేట పంప్‌హౌస్ పనులను రూ.1494 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. దేవన్నపేట పంప్‌హౌస్‌తో కొత్తగా 60 వేల ఎకరాలు పారడంతోపాటు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనున్నది. జనగామ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఆయకట్టుకు దేవన్నపేట పంప్‌హౌస్‌తో సాగునీరు అందనున్నది. మంత్రులు ఉత్తమ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హడావిడితో దేవన్నపేట పంప్‌హౌస్ మోటర్లు ఆన్ కాకుండానే పోయాయి.
ఈ పంప్‌హౌస్ పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మించింది. ఆస్ట్రియా నుంచి తెచ్చి భారీ మోటర్లను అమర్చారు. మోటర్ల సాంకేతిక నిపుణులు లేకుండానే మంత్రులు ఒత్తిడి తెచ్చి వాటిని ఆన్ చేసే ప్రయత్నం చేశారని, అందుకే ఆన్ కాలేదని సాగునీటి అధికారులు చెబుతున్నారు. డిజిటల్ పద్ధతికి బదులుగా మాన్యువల్‌గా ఆన్ చేసే ప్రయత్నం చేయడంతో మోటర్లు మొరాయించాయని, ఎప్పటి వరకు ఆన్ అవుతాయో తెలియని పరిస్థితి ఉన్నదని అంటున్నారు.