హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానం గందరగోళాన్ని తలపిస్తున్నది. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధానం అమలవుతున్నది. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయ్యేందుకు ఓయూ.. మహాత్మాగాంధీ వర్సిటీలో 50% చొప్పున, జేఎన్టీయూ, కేయూలో 25% క్రెడిట్ల చొప్పున అమలుచేస్తున్నారు. ఒకే రాష్ట్రంలో రెండు విధానాలుండటం గమనార్హం. ఇక ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, అసైన్మెంట్లు, ల్యాబ్, థియరీకి కామన్ క్రెడిట్స్ విధానం లేదు. వేలాది మంది విద్యార్థులు నిర్దిష్ట క్రెడిట్లు సాధించలేక డీటెయిన్డ్ అవుతున్నారు.
క్రెడిట్ల విధానం అస్తవ్యవస్థంగా ఉండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే డీటెయిన్డ్ అయిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుచేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ రీ ఎగ్జామ్, రీ అడ్మిషన్, ఫీజులు చెల్లించేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఓయూలో నాలుగేండ్ల బీటెక్ కోర్సును ఆరేండ్లలో మాత్రమే పూర్తిచేసే అవకాశమున్నది. కానీ ఫార్మసీ, లా, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్ కోర్సులను ఆయా కోర్సు వ్యవధి పూర్తయిన తర్వాత రెట్టింపు సమయాన్నిస్తున్నారు. ఇది కూడా సమస్యగా మారింది. తాజాగా మూడేండ్ల డిగ్రీ కోర్సులోనూ డిటెన్షన్‌కు అనుసరిస్తున్న క్రెడిట్లను తగ్గించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాష్ట్రంలో అమలవుతున్న డిటెన్షన్ విధానంపై ఏకంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. 2024 డిసెంబర్లో అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీ వేదికగా సమాధానమిచ్చారు. 2024-25 విద్యాసంవత్సరంలో మినహాయింపు ఇస్తున్నామని, వచ్చే విద్యాసంవత్సరం కల్లా అన్ని వర్సిటీలకు కామన్ డిటెన్షన్ విధానం అమలుచేస్తామని తెలిపారు.
కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఒకటిరెండు సమావేశాలు జరిగినా.. ఇంతవరకు ఈ అంశం కొలిక్కిరాలేదు. కామన్ డిటెన్షన్ పాలసీ సిద్ధంకాలేదు. ఇప్పటికే ఓ విద్యాసంవత్సరం గడిచిపోయింది. 2025-26 విద్యాసంవత్సరం రానే వచ్చింది. నిర్దిష్ట క్రెడిట్లు సాధించని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి.
మూడేండ్ల డిగ్రీ కోర్సుల్లోనూ డిటెన్షన్‌కు అనుసరిస్తున్న క్రెడిట్లను తగ్గించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫస్టియర్ నుంచి సెకండియర్, సెకండియర్ నుంచి థర్డ్ ఇయర్‌కు ప్రమోట్ కావాలంటే కనీసం 50% క్రెడి ట్లు తెచ్చుకుని ఉండాలి. ఈ నిబంధనతో వేలా ది మంది పైతరగతులకు ప్రమోట్ కాక, మధ్యలోనే డిటెన్షన్ అవుతున్నారు. ఇది విద్యార్థులకు భారంగా మారుతున్నదన్న వాదనలున్నాయి.
50% క్రెడిట్లను 25కు తగ్గించాలన్న డిమాండ్లున్నాయి. ఇదే విషయంపై తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ బీ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు ఇది నష్టం కలిగిస్తున్నదని వాపోయారు. క్రెడిట్లను 25శాతానికి తగ్గించాలని కోరారు. వర్సిటీ వీసీలు కూడా దీనిపై ఉన్నత విద్యామండలికి వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు.