నారాయణపేట రూరల్, మార్చి 3 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వే పోలీసు బలగాలను మోహరించి సర్వే చేపడుతున్నా రైతుల నుంచి ఆటంకాలు తప్పడంలేదు. సోమవారం నారాయణపేట జిల్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి శివారులో ఆర్ఐ గోపాల్‌రావు, జూనియర్ అసిస్టెంట్ల బృందం ప్రాజెక్టు కోసం సర్వే చేపట్టగా.. సంబంధిత భూముల రైతులు వెళ్లి అడ్డుకున్నారు. కొడంగల్ లిఫ్ట్‌లో విలువైన భూములు కోల్పోతామని రైతులు హన్మంతు, మాలప్ప, చిన్నబాలప్ప, నర్సింహ, రాములు అధికారులను నిలదీశారు.అనుమతి లేకుండా ఎలా సర్వే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగిపోయారు.
మహబూబ్‌నగర్, మార్చి 3 : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులపైన కాంగ్రెస్ నాయకులు జులుం చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లిలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. ఆదివారం మధ్యాహ్నం దొడ్డలోనిపల్లికి చెందిన బాలకొండయ్య ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తుంటే టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఇసుక ట్రాక్టర్ తరలిస్తుండగా.. పట్టుకున్న ప్రదేశానికి టూటౌన్ పీఎస్ కానిస్టేబుళ్లు ఇద్దరు వివరాలు సేకరించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బాలకొండయ్య, వెంకట్రాది అక్కడకు చేరుకొని ట్రాక్టర్‌ను పట్టుకోవడానికి వచ్చారా? అని కానిస్టేబుళ్లను ప్రశ్నించారు. ఎస్పీ, డీఎస్పీలే మేము వెళితే కూర్చోమంటారు.. మీరెంత.. అం టూ వారిని నానా దుర్భాషలాడారు. దీంతో టూటౌన్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. విధి నిర్వహణలో విచారణకు వెళితే కాంగ్రెస్ నాయకులు దాడికి య త్నించారని కానిస్టేబుల్ పేర్కొన్నారు.