JEE | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా విద్యార్థి భూక్యా లోహిత్‌ను అదృష్టం వెక్కిరించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన లోహిత్.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశానని, ఆ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలు వచ్చాక ఆ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 7న సంబంధిత అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని లోహిత్ తరఫు న్యాయవాది తెలిపారు.దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి స్పందిస్తూ.. పిటిషనర్ వినతిపై ఏ నిర్ణయం తీసుకున్నదీ చెప్పాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.