హైదరాబాద్, మార్చి25 (నమస్తే తెలంగాణ): ‘మంత్రి లేకుండా బిల్లు పెడుతారా? అసెంబ్లీ నడిపే తీరిదేనా?’ అని కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు. శాసనసభను నిర్వహిస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రోజున ప్రశ్నోత్తరాలు ముగిసినట్టు ప్రకటించిన అనంతరం.. తెలంగాణ వస్తువుల, సేవల పన్ను సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించారు. కానీ, ఆ సమయంలో సభలో మంత్రి అందుబాటులో లేరు. మంత్రి లోపలికి రాకుండానే స్పీకర్ బిల్లును చదవడం ప్రారంభించారు.
దీనిపై హరీశ్‌రావు, తలసాని, ఇతర బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆలోగా మంత్రి జూపల్లి సభలోనికి విచ్చేశారు. మంత్రి జూపల్లి మరోసారి ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు పూనుకున్నారు. మంత్రిని స్పీకర్ వారించి బిల్లును తాను చదివాక సభలో ప్రవేశపెట్టాలని మంత్రికి సూచించారు. ఆ మేరకే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మరోసారి హరీశ్‌రావు అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీని నడిపే తీరిదేనా? అంటూ అసహనం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల గడువును బుధవారం సైతం 3 ప్రశ్నలకే స్పీకర్ పరిమితం చేశారు. ప్రశ్నోత్తరాలకు సంబంధించి మొత్తంగా 10 ప్రశ్నలకు షెడ్యూల్ చేశారు. సభ ప్రారంభమైన అనంతరం అధికార పక్ష సభ్యులే వ్యవసాయ ఉత్పత్తులు, ఇందిరమ్మ ఇండ్లు, సోలార్ మాడల్ పథకాలపై మూడు ప్రశ్నలను లేవనెత్తారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిందని స్పీకర్ ప్రకటించారు.
సభ మీరే నడుపుకోండి: తలసాని
స్పీకర్, సర్కార్ తీరుపై బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలకు అవకాశం ఇవ్వకుంటే ఎలా? అని ప్రశ్నించారు. అలాగైతే సభ ఎందుకని నిలదీశారు.