హనుమకొండ చౌరస్తా, జనవరి 6 : హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటో మిస్సయ్యింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానుండడంతో వారి ఫొటోలతో వేదికపై ఆర్టీసీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి ఫొటో లేకపోవడంతో కార్యక్రమానికి వచ్చినవారు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భానుకిరణ్, మాధవరావు, డిపో మేనేజర్ మోహన్‌రావు అప్పటికప్పుడు భట్టి ఫొటోను తీసుకొచ్చి ఫ్లెక్సీకి అతికించి హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు.