గురుకులాల్లో మృత్యుఘోషపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించగానే ప్రభుత్వంలో కదలిక మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు ప్రభుత్వ లోపాలను ఎక్కడికక్కడ ఎత్తిచూపారు. సోమవారం పెద్దాపూర్‌లో మృతిచెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్.. సర్కారు స్పందనరాహిత్యంపై చురకలు అంటించారు. ‘పసిమొగ్గలు రాలుతున్నా స్పందించరా’ అని ప్రశ్నించారు. చివరికి సర్కార్ స్పందించక తప్పలేదు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. డిప్యూటీ సీఎం భట్టి పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న గురుకులాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీయడంతో రేవంత్ సర్కారులో కదలిక వచ్చింది. ఓవైపు బీఆర్ఎస్ ఒత్తిడి, మరోవైపు ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆందోళనలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో మృతిచెందిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన అనిరుధ్ కుటుంబాన్ని సోమవారం పరామర్శించిన కేటీఆర్, ఏ తల్లీ గర్భశోకంతో బాధపడకూడదంటూ గురుకులాల పనితీరు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని చెప్పడంతో 24 గంటల్లోనే సర్కారు స్పందించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను రంగంలోకి దింపి గురుకులాల సందర్శనకు పంపింది. మరోవైపు హాస్టళ్లలో తనిఖీలకు పది ఏసీబీ అధికారుల బృందాలను పురమాయించింది. రాష్ట్రవ్యాప్తంగా పది హాస్టళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించగా దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూశాయి.
అధికారులతో తనిఖీలు
కేటీఆర్ సూచనతో రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఏసీబీ అధికారులతోపాటు ఫుడ్‌సేప్టీ, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ క్యాలిటీ, క్వాంటిటీ చెక్ ఆడిటర్లతో ప్రభుత్వం మంగళవారం పది హాస్టళ్లలో తనిఖీలు చేపట్టింది. వానకాలం కావడంతో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, ఈగలు, పాములు, తేళ్లు వస్తున్నట్టు గమనించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఎందుకు శుభ్రం చేయడం లేదని స్కావెంజర్లను ప్రశ్నించారు.నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాల రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాల హాజరు పట్టికలో 272 మంది ఉండగా 100 మంది వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను కలెక్టర్ సంతోష్ సందర్శించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని కోడూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ విజయేంద్ర బోయి తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
నారాయణపేట జిల్లా ఊ ట్కూర్ మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత, ప్రాథమిక పాఠశాలను ట్రె యినీ కలెక్టర్ గరీమ నరుల సందర్శించారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ నిర్వాహకులు హాస్టల్‌కు రాని విద్యార్థుల రిజిస్టర్ పట్టికలో గైర్హాజరు అని వేయకుండా డాట్లు పెట్టడాన్ని గుర్తించారు. నిజామాబాద్‌లోని కోటగల్లి ప్రభుత్వ ఎస్సీ బాలిక హాస్టల్లో సిబ్బంది హాజరు రిజిస్టర్ సరిగ్గా లేదని, హాస్టల్ వస్తువుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. నాణ్యత లోపించిన, గడువు దాటిన ఆహార పదార్థాలను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌కు పంపించారు. జనగామ ఎస్సీ బాలికల వసతి గృహంలో రికార్డుల ప్రకారం 110 మంది విద్యార్థులుండగా సోమవారం రాత్రి 73 మంది హాజరైనట్టు చూపించినా వాస్తవానికి 60 మందే ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. తనిఖీల్లో గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
మండిపడ్డ కేటీఆర్.. 24గంటల్లోనే కదిలిన సర్కార్
గురుకులాల్లో విద్యార్థుల మృత్యుఘోష వినిపిస్తున్నదని, ఎనిమిది నెల ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 36 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మండిపడ్డారు. 500 మందికిపైగా పుడ్పాయిజన్తో దవాఖానలపాలు కావడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో మృతిచెందిన అనిరుధ్ కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు.ఏ తల్లి గర్భశోకంతో బాధపడకూడదని గురుకులాల పనితీరు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టా రు. గురుకులాలను పరిశీలించేందుకు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో కమిటీ వేస్తామని ప్రకటించారు. కమి టీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా గురుకులాలను దత్తత తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు.