మేం అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో.. ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. జూన్ 2నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తిచేస్తాం. జాబ్ క్యాలెండర్‌పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది.
Job Calendar | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ‘అదిగో జాబ్ క్యాలెండర్.. ఇదిగో జాబ్ క్యాలెండర్’ అంటూ నిరుద్యోగులను ఊరించిన రేవంత్‌రెడ్డి సర్కారు, తాజాగా ఖాళీల వివరాల్లేని.. నోటిఫికేషన్, పరీక్షల తేదీల్లేని జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రకటించి ఉసూరుమనిపించింది. జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 రకాల షెడ్యూళ్లను ప్రకటించగా వీటిలో అర్హత పరీక్ష అయిన టెట్ రెండు సార్లు ఉన్నది. మిగతా 18లో గ్రూప్ -1, 2, 3 నోటిఫికేషన్లు గతంలో జారీ అయినవే కావడం గమనార్హం. పరీక్షలు మాత్రమే నిర్వహించాల్సి ఉన్న వీటిని కూడా కొత్త జాబ్ క్యాలెండర్లో ప్రకటించి కాంగ్రెస్ సర్కారు తన ఖాతాలో వేసుకున్నది. యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తు గడువు, రాత పరీక్ష తేదీ లాంటి పూర్తి వివరాలు అందులో పొందుపరుస్తుంది. కానీ రేవంత్ సర్కారు ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఇవేవీ లేవు. కేవలం ఫలానా నెలలో నోటిఫికేషన్ ఇస్తాం.. ఫలానా నెలలో పరీక్ష నిర్వహిస్తామన్న వివరాలు మాత్రమే ప్రకటించారు.
యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అంటే ఇదేనా? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పైగా భర్తీచేసే పోస్టుల సంఖ్యను కూడా ఈ క్యాలెండర్లో పేర్కొనకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన అభయహస్తం మ్యానిఫెస్టోలో జూన్ 2నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17లోపు నియామకాలు పూర్తిచేస్తామని ఢంకా బజాయించింది. జూన్ పోయి సెప్టెంబర్ సమీపిస్తున్నా ఇంత వరకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేయలేదు. ఈ విషయంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా 8 నెలలు ఆలస్యం చేసి తేదీ ల్లేకుండా జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీలో ప్రకటించింది. ‘గతంలో ఇచ్చిన ప్రకటనకే దిక్కూమొక్కూలేదు. ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పైనా నమ్మకం లేదు.. తప్పించుకునేందుకే ఇలా తేదీల్లేకుండా క్యాలెండర్ ప్రకటించినట్టు ఉన్నది’ అని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
చట్టబద్ధత ఏదీ?
జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు పదేపదే ప్రకటించి ఇప్పుడు పూర్తిగా విస్మరించారు. తాజాగా శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన మాత్రమే చేశారు. చట్టబద్ధత కల్పించడమంటే స్పీకర్ ఆమోదంతో తొలుత బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించి ఆమోదిస్తారు. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుంది. ఒకవేళ చట్టబద్ధత కల్పించి షెడ్యూల్స్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతే దోషిగా నిలబడాల్సి వస్తుందని గ్రహించే ఇలా ఉత్తుత్తి ప్రకటన చేసిందన్న వాదనలు వినిపిన్నాయి.
ప్రకటించాల్సింది రిక్రూటింగ్ ఏజెన్సీలే
వాస్తవానికి జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వాలు ప్రకటించవు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఏజెన్సీలు మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. కమిషన్ సభ్యులు, బోర్డు సభ్యులు భేటీ అయ్యి.. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన పోస్టుల పూర్వాపరాలను పరిశీలించి ఎప్పుడు ఏ ఉద్యోగాలను భర్తీచేయాలో నిర్ణయించి ఆయా సంస్థలు మాత్రమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తాయి. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సైతం ఇదే తరహా సంప్రదాయాన్ని పాటిస్తున్నది. ఇలా రాజ్యాంగబద్ధంగా ప్రణాళికలతో రూపొందించి, ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కే చట్టబద్ధత ఉంటుంది. ఇవే చెల్లుబాటు అవుతాయి. కానీ రాజ్యాంగబద్ధంగా నియమితులైన కమిషన్, బోర్డు సభ్యులు చేయాల్సిన పనిని కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత కార్యక్రమంగా మార్చేసింది. అంటే టీఎస్పీఎస్సీ సహా ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలను తమ జేబు సంస్థల్లా మార్చేసిందన్న విమర్శలు వ స్తున్నాయి. సభలో జాబ్‌క్యాలెండర్‌ను ప్రకటించిన తీరుపైనా నిరుద్యోగులు పెదవివిరుస్తున్నారు.