Bhatti Vikramarka | హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని, విద్యుత్తు మిగులు ఉన్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్తు విధానాన్ని అమలు చేయనున్నామని వివరించారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని, బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర దశ మారబోతున్నదని తెలిపారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని, లేనిపక్షంలో అభివృద్దికి అటంకం ఏర్పడుతుందని అన్నారు.
వ్యవసాయరంగానికి సంబంధించి గత సంవత్సరం కన్నా రూ.13వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ చిన్న, సన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో 73.11 శాతం భూములు చిన్న, సన్న కారు రైతుల వద్దనే ఉన్నాయని, కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు చాలా తక్కువగా ఇస్తున్నాయని, ఈ రుణాలను పెంచాలన్నారు.