CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘అన్నలు జర మాట్లాడండే. నాపై, నా అల్లుడిపై విమర్శల దాడి జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా స్పందించకపోతే ఎట్లా. నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాలా. మీరు ఎదురు దాడి చేయరా. ఇదేమైనా నా ఒక్కడి కోసం చేస్తున్నానా’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సహచర మంత్రులను వేడుకొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. లగచర్ల ఘటనకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నది. ఆయన అల్లుడి కోసమే లగచర్లలో భూసేకరణ చేస్తున్నారని ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా తన సహచర మంత్రులెవరూ కూడా మాట్లాడటంలేదు. ఓ వైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ విరుచుకుపడటం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మరక్షణలో పడిపోయినట్టు చెప్తున్నారు. దీంతో బీఆర్ఎస్పై ఎదురుదాడికి మంత్రులను వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం ఆయన వరుసపెట్టి మంత్రులకు ఫోన్ చేసినట్టు తెలిసింది. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఆరోపణలపై ఎదురుదాడి చేయాలని వేడుకున్నట్టు సమాచారం. దీంతో అప్పటివరకు అంటీముట్టనట్టుగా ఉన్న మంత్రులు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చారు. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. లగచర్ల ఘటనను ఖండిస్తూ, బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగారు. లగచర్ల ఘటనలో ప్రభుత్వం తప్పేమీ లేకపోయి ఉంటే.. మంత్రులంతా ఎప్పుడో స్వచ్ఛందంగా మాట్లాడేవారని, కానీ ఏదో గూడుపుఠాని ఉంది కాబట్టే మంత్రులు దాని జోలికి వెళ్లడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంతానికి చేసుకుంటుంటే తామెందుకు బద్నాం కావాలి, తామెందుకు ఆయనకు సహకరించాలనే ధోరణిలో మంత్రులు వ్యవహరించినట్టు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందుకే ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్నా మంత్రులంతా సైలెంట్‌గా ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులపై దాడిని ఖండించరా : పొన్నం
రైతులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు అధికారులపై దాడిని ఎందుకు ఖండించడం లేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు.లగచర్ల ఘటనలో అసలు దోషులను త్వరలోనే మీడియా ముందుకు తీసుకొస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
దళిత, గిరిజన రైతులను రెచ్చగొడుతున్నారు: డిప్యూటీ సీఎం
లగచర్ల ఘటనలో దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోయే రైతుల బాధలు తమకు తెలుసునని అన్నారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ… లగచర్లలో కలెక్టర్‌పై దాడి బీఆర్ఎస్ కుట్రనే అని అన్నారు. కలెక్టర్‌పై దాడి వెనుక ఎంతటివారు ఉన్నా ఉపేక్షించబోమని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఒకవేళ గవర్నర్ తిరసరిస్తే చట్టం ప్రకారం ముందుకు వెళ్తామన్నారు.