మధిర, జనవరి 28 : మంత్రులు తనను కలవడంలో తప్పేముందని, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతోనే తనను కలిసేందుకు ప్రజాభవన్‌కు వచ్చారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. తనను కలవకుండా పిచ్చి వార్తలు రాసే వారిని కలవాలా? అని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము పాలనాపరమైన అంశాలపైనే చర్చించామని స్పష్టంచేశారు. క్యాబినెట్‌లోని మంత్రులంతా ఉమ్మడి కుటుంబంలా రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పొత్తుల అంశం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయిస్తారని స్పష్టంచేశారు.
హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా రూ.100 కోట్లతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో విపత్తుల నిర్వహణ విభాగం ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఐసీసీసీ విభాగాలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్, ఆధునిక రెస్యూ పరికరాలు, ఫైర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ల కోసం సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.