మంచిర్యాల, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ సింగరేణి బాట దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. సింగరేణి స్కామ్‌లు ఒక్కొక్కటీ బయటపెడుతూ బీఆర్ఎస్ పుట్టించిన అగ్గికి హడలిపోయిన సర్కార్.. సింగరేణి కార్మికులను దగ్గర చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం 335 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. సింగరేణిని దోపిడీ చేద్దామన్న ఆలోచన కాంగ్రెస్ సర్కార్‌కు లేదని అన్నారు. కోల్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40లక్షల ప్రమాద బీమా, 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల బోనస్ ఇచ్చింది ప్రజా ప్రభుత్వమే అంటూ చెప్పుకొచ్చారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇక ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు.
సింగరేణిని ప్రైవేట్‌పరం చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంటే.. అడ్డుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా జంగ్ సైరన్ మోగించింది బీఆర్ఎస్ సర్కార్. ఆందోళనలు చేసి, కార్మికులను ఏకం చేసింది గత సర్కార్. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా సత్తుపల్లి, కోయగూడ బొగ్గు బ్లాక్‌ల వేలంలో పెట్టింది. రెండు ప్రైవేటు సంస్థలు వేలంలో ఆ బ్లాక్‌లను దక్కించుకుంటే సింగరేణిలో ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు ఎలా పని చేస్తారో చూస్తామంటూ హెచ్చరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పటికీ సింగరేణి బొగ్గు బ్లాకుల్లో ప్రైవేట్ కాంట్రాక్టర్లు తట్టెడు మట్టి కూడా ఎత్తలేకపోయారంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీనే. ఇది సింగరేణిలో ఏ కార్మికుడిని అడిగినా చెప్తారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేసి సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలని, నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్కు ఆపాదించే ప్రయత్నం చేశారు. ఈ రెండు బొగ్గు బ్లాక్‌ల వేలంతో రూ.2624 కోట్లు సింగరేణి నష్టపోయిందంటూ చెప్పారు.