హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన బడ్జెట్ వాస్తవికమైనదని, ప్రజల ఆశలు, ఆకాంక్షలతోపాటు వారి గుండె చప్పుడును అర్థం చేసుకుని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్‌ను తెచ్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. తాము ప్రమాణ స్వీకారం చేయగానే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీల అమలు ప్రక్రియను ప్రారంభించామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించే పథకానికి అదేరోజు శ్రీకారం చుట్టామని వివరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 1నే జీతాలు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చకు శనివారం ఆయన సమాధానమిస్తూ.. అన్ని రంగాలు, వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, దీనిపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఊదరగొట్టారు. చాలా తక్కువ సమయంలోనే 32,410 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించామని, మరో 32 వేల ఉద్యోగాల భర్తీ కోసం పోటీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు రూ.3 వేల కోట్లు కేటాయించారని, హిందువులను విస్మరించారని పేర్కొంటూ మత వైషమ్యాలను రెచ్చగొట్టేలా కొన్ని చానళ్లలో విషప్రచారం చేశారని, అటువంటివారిని సహించేది లేదని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను సమానంగా ఆదరిస్తున్నదని, సమ్మక సారలమ్మ జాతరకు రూ.100 కోట్లు, బోనాల పండుగకు రూ.25 కోట్లు కేటాయించిందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో చిన్నగూడూరు మండలానికి తెలంగాణ బిడ్డ, ప్రముఖ కవి, రచయిత దాశరథి పేరు పెడతామని, శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.