హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : బీసీలు రాజ్యాధికార సాధన పోరాటానికి నడుం బిగించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ పిలుపునిచ్చారు. విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు రచించిన ‘హిస్సా ఇజ్జత్ హుకుమత్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో బండ ప్రకాశ్ పాల్గొని మాట్లాడుతూ రాజకీయ, ఆర్థికరంగాల్లో బీసీలు అణిచివేతకు గురైన తీరును పుస్తకంలో గణాంకాలతో పొందుపరిచారని తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి మాట్లాడుతూ బీసీలు చైతన్యం తెచ్చుకొని అధికారం, హకుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో కులంతో పాటు డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్నదని, బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. సుదీర్థం అధ్యయనంతో పుస్తకాన్ని రచించానని చిరంజీవులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీలు హనుమంతరావు, బూర నర్సయ్యగౌడ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ప్రముఖ రచయిత సంగిశెట్టి శ్రీనివాస్, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.