మహబూబ్‌నగర్, నవంబర్ 7: మహబూబ్‌నగర్ ఇన్చార్జి డీఈవో రవీందర్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ మేరకు గురువారం ఏసీబీ ఏఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు. తనకంటే జూనియర్ అయిన ఉపాధ్యాయురాలికి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కల్పించారని మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు డీఈవో రవీందర్ దృష్టికి తీసుకెళ్లింది. తాను ఏమీ చేయలేనని కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకోవాలని డీఈవో సూచించారు. దీంతో సదరు ఉపాధ్యాయురాలు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నది. అయినా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రమోషన్ కావాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముందుగా రూ.1.50 లక్షలను తీసుకొని ప్రమోషన్ ఇచ్చారు. న్యాయంగా తనకు రావాల్సిన ప్రమోషన్‌ను జూనియర్‌కు ఇవ్వడంతోపాటు కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు కూడా లంచం డిమాండ్ చేయడంతో ఆమె తన భర్తతో కలిసి ఏసీబీని ఆశ్రయించింది. మిగిలిన రూ.50 వేలను ఇచ్చేందుకు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీలో డీఈవో ఇంటికి వెళ్లారు. లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఈవో, అతడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి డీఈవోను అడిషనల్ స్పెషల్ జడ్జి, ఏసీబీ కేసుల కోర్టు నాంపల్లి హైదరాబాద్‌కు తరలించినట్టు ఏసీబీ ఏఎస్పీ తెలిపారు.