చివ్వేంల, మార్చి 08: సాధారణంగా సెప్టెంబర్ నుంచి జనవరి నెలల మధ్య మంచు కురుస్తూ ఉంటుంది. సంక్రాంతి తర్వాత వాతారణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ దీనికి భిన్నంగా మార్చి నెలలోనూ కొన్ని ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేస్తున్నది. శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్ర శివారుతోపాటు, బీబీగూడెం, అక్కలదేవి గూడెం, సూర్యాపేట-ఖమ్మం రహదారి, హైదరాబాద్-ఖమ్మం రహదారిపై దట్టంగా మంచు కమ్మేసింది. రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఉదయం 8 గంటలు అయినా మంచు దుప్పటి వదలకపోవడంతో ఇదెక్కడి కాలమని, ఒక్కరోజులో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొన్నది. ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత చలిగాలులు వీస్తున్నాయి. 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇక భానుడి భగ భగతో ప్రజలు అల్లాడిపోతున్న హైదరాబాద్ నగరవాసులు రాత్రిపూట చలితో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం పగలు పలుచోట్ల 35.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా, పటాన్చెరు (Patancheru) ప్రాంతంలో రాత్రిపూట అత్యల్పంగా 10.2, రాజేంద్రనగర్లో 11 డిగ్రీల ఉషోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి సమయంలో ఉత్తర, ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో 10-16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాత్రి సమయంలో దుండిగల్లో 15.4, బేగంపేట 16.2, హకీంపేట 19.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్లో మరో రెండురోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 2-6 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, 9వ తేదీ తర్వాత పగటి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరుగుతాయని వెల్లడించారు.