ములుగు, జనవరి23 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం లో గురువారం చేపట్టిన గ్రామ సభ కుమ్మరి నాగేశ్వర్రావు (నాగయ్య) ప్రాణం మీదుకు తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తీవ్ర మనస్తాపం చెందిన నాగయ్య గ్రామసభ సాక్షిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గ్రామస్తులు, బాధితుడి భార్య శాంత తెలిపిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన నాగయ్యకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, మొదటి అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్, రెండో అమ్మాయి 9వ తరగతి, మూడో అమ్మాయి 7వ తరగతి చదువుతున్నారు. అతడి భార్య అంగన్వాడీ సెంటర్లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రజాపాలనలో నాగయ్య దరఖాస్తు చేసుకున్నాడు.
గురువారం జరిగిన గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడంలో అధికారులను నిలదీశాడు. వారు పొంతనలేని సమాధానం చెప్పి తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో అన్ని అర్హతలూ ఉన్న తన పేరును జాబితాలో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గ్రామస్తులు అతడిని ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించగా మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ములుగు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అధికారులు అర్హులను ఎంపిక చేయకపోవడం వల్లే తన భర్త పురుగుల మందు తాగాడని నాగయ్య భార్య శాంత కన్నీటిపర్యంతమైంది.