హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డెంగీ ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి 1,200 కేసులు నమోదయ్యాయి. ఒక్క జూన్‌లోనే 500 పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 25 శాతం మంది బాధితులు ఉన్నారని అధికారిక లెక్కలే స్పష్టంచేస్తున్నాయి.
ఐదేండ్లలో 2024లోనే అత్యధికంగా 1,00,77 డెంగీ కేసులు నమోదయ్యాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను, జ్వరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాల్సి ఉంటుంది. కానీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే 2024లో కేసులు పెరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖపై ప్రత్యేక శ్రద్ధతో విషజ్వరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని, కానీ కాంగ్రెస్ హయాంలో పాలన పడకేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రజలు డెంగీ బారిన పడకుండా ఇండ్లలో తప్పనిసరిగా దోమతెరలు వాడాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గుడ్‌నైట్, ఆలౌట్ వంటివి పడుకునే రెండు గంటల ముందు ఆన్ చేసుకుని.. ఆఫ్ చేసిన రెండు గంటల తర్వాతే ఆ గదిలో పడుకోవాలి. పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు తొడిగించాలి. అధిక జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, శరీరంపై ఎర్రమచ్చలు, నీరసం, చీకాకుగా ఉండటం, విపరీతంగా పొట్ట నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.