Dengue Fever | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం డెంగ్యూ కోరల్లో చిక్కుకున్నది. ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 నాటికి ఏకంగా 5,246 కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 శాతం కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే వెలుగు చూశాయి. మొత్తం 2,148 మందికి పాజిటివ్‌గా తేలింది.
ఇవి ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ (ఐఐహెచ్‌పీ)లో నమోదుచేసిన అధికారిక లెక్కలు మాత్రమే. ఇంకా అనధికారికంగా కేసులు రెట్టింపు ఉంటాయని అంచనా. ప్రస్తుతం ప్రతి వంద మంది అనుమానితుల్లో 7-8 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా తేలుతున్నది. ఇప్పటివరకు 8 మంది డెంగ్యూతో మరణించినట్టు వైద్యారోగ్యశాఖ చెప్తున్నది. కానీ మరణాలు పదుల సంఖ్యలో ఉంటాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల ఒకే రోజులో ఐదుగురు మరణించడాన్ని ఉదహరించారు. దీంతోపాటు రాష్ట్రంలో మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు సైతం విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలు, వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించటం, వైద్యశాఖ సన్నద్ధత.. ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా గత ఏడాదితో పోల్చితే ఈసారి ఏకంగా 36 శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రంలో 3,861 కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది అదనంగా 1,385 కేసులు పెరిగాయి.
డెంగ్యూతోపాటు రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన జ్వర సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్టు తేలింది. డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ (2,148 మంది) టాప్‌లో ఉన్నది. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాది 106 చికున్‌గున్యా కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 5 శాతంగా ఉన్నది. 188 మందికి మలేరియా సోకింది. సీజనల్ వ్యాధులపై శనివారం కోఠిలో డీపీహెచ్ రవీందర్ నాయక్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఇందులో ఈ ఏడాది ఆగస్టు 21 వరకు 6,648 కేసులు వెలుగు చూసినట్టు తెలిపారు. అయితే ఐఐహెచ్‌పీ గణాంకాలతో పోల్చితే కేసుల సంఖ్య తక్కువగా ప్రకటించారని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే విషయంపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. వివరాలను మరోసారి సరిచూసుకుంటానని డీహెచ్ సమాధానం ఇచ్చారు. ఐఐహెచ్పీతో పోల్చితే దాదాపు 600 కేసులను తక్కువగా పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కేసుల సంఖ్య 40 శాతం తక్కువ చేసి చూపించారని చెప్తున్నారు.
సీజనల్ వ్యాధులను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దోమల నియంత్రణకు ఇతర శాఖలను సమన్వయం చేయటంలో వైద్యశాఖ వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో దోమలు పెరిగాయని చెప్తున్నారు. వానకాలం మొదలయ్యే సమాయానికి గతంలో పల్లెప్రగతి, పట్టణప్రగతి వంటి కార్యక్రమాలు నిర్వహించి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టేవారని, దోమలు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రసాయనాలు పిచికారీ చేసేవారని, నిల్వ ఉంచిన నీటిని తొలగించేవారని గుర్తు చేస్తున్నారు.
కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టడంతో పారిశుద్ధ్యం లోపించిందని అంటున్నారు. దీనికితోడు వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోలేదని, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయలేదని, నివారణ చర్యల పట్ల ప్రచారం చేయలేదని మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మందుల కొరత నెలకొన్నదని, సాధారణంగా సీజనల్ వ్యాధులకు ముందే పీహెచ్సీ నుంచి అన్ని స్థాయుల దవాఖానల్లో బఫర్ స్టాక్‌ను ఉంచుకోవాలని, కానీ ఈసారి అనేక దవాఖానల్లో స్లైన్ బాటిళ్లు, యాంటిబయాటిక్స్ కూడా లేని దుస్థితి నెలకొన్నదని చెప్తున్నారు. ఫలితంగా ప్రజలు రోగాలబారిన పడుతున్నారని పేర్కొంటున్నారు.
డెంగ్యూ కేసులు (ఆగస్టు 21 నాటికి – డీపీహెచ్ లెక్కల ప్రకారం)