పండుగ పూట పేదలపై హైడ్రా ప్రతాపం చూపింది. బడుగు జీవులకు దసరా సంబురం లేకుండా చేసింది. మళ్లీ కోర్టు సెలవు రోజును ఆసరా చేసుకొని శనివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతినగర్ సర్వేనంబర్ 59లోని ఇండ్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు బడుగుజీవులకు దసరా (Dasara) సంబురం లేకుండా చేశాయి. పండుగ సీజన్‌ను ప్రత్యేకంగా ఎంచుకుని హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి నడిపిస్తున్న తీరుతో ప్రజలు భగ్గుమంటున్నారు. దసరా పండుగ, పిల్ల దసరా ముగిసిన మరుసటిరోజు శనివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని భిక్షపతినగర్ సర్వేనెంబర్ 59లోని ఇండ్లను హైడ్రా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసింది. గతంలో జిల్లా కోర్టు వీరికి అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఇది ప్రభుత్వ స్థలమేనంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్తూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే తమకు కోర్టుకు వెళ్లే అవకాశమే ఇవ్వకుండా శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టవద్దంటూ హైకోర్టు గతంలోనే హెచ్చరించినా హైడ్రా మాత్రం పండుగ రోజుల్లో కూడా పేదలను ప్రశాంతంగా ఉండడనివ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శనివారమే కూల్చివేతలకు పాల్పడి వారెవరూ న్యాయస్థానాలకు వెళ్లేందుకు అనుకూలమైన సమయం ఇవ్వకుండా పక్కాప్రణాళికతో, నోటీసులివ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ హైడ్రా అధికారులపై మండిపడుతున్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న పురుషులకు ప్రభుత్వం ఇచ్చిన భూములని, వాటిని కబ్జా చేసిన భూములు అంటూ రేవంత్‌రెడ్డి లాక్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.
సూర్యోదయంతోనే పేదల బతుకుల్లో చీకట్లు
శనివారం ఉదయమే హైడ్రా అధికారులు, పోలీసులతో కలిసి భిక్షపతినగర్కు చేరుకున్నారు. బుల్డోజర్లు, పొక్లెయినర్ల సాయంతో అక్కడ ఉన్న నిర్మాణాలను వేగంగా తొలగించారు. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి రెండు కిలోమీటర్ల వరకు బయట వారెవరినీ లోపలికి అనుమతించలేదు. ఇండ్లల్లో ఉన్న అందరినీ నిద్ర నుంచి లేపి మరీ బయటకు పంపించడంతో వారంతా ఏం జరుగుతున్నదో అర్థంకాక ఆందోళన చెందారు. కండ్ల ముందే ఇండ్లు కూలిపోతుంటే కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికిప్పుడు ఇండ్లు కూల్చిపొమ్మంటే ఎక్కడికి పోతామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. చెప్పేదేమీ వినిపించుకోకుండా పోలీసులు, హైడ్రా సిబ్బంది బాధితులను ఇండ్లలో నుంచి తరిమికొట్టి, సామాన్లు బయట పడేశారు. ఆ తర్వాత ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేసి, ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.
మొత్తం 36 ఎకరాల స్థలంలోని నిర్మాణాలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామంటూ హైడ్రా ప్రకటించింది. కూల్చివేతల బాధితులు మాత్రం గత అరవై ఏండ్లుగా ఆ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని, తమ తాతలు, తండ్రులు ఇందిరమ్మ హయాంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే ఈ భూములు ఇచ్చారని, ఇందిరమ్మ ఇచ్చిన భూములను ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్‌రెడ్డి సర్కారు గుంజుకుంటున్నదంటూ విమర్శించారు. తమను రోడ్డున పడేసిన రేవంత్‌రెడ్డి ఏం బాగుపడుతాడంటూ బాధితులు శాపనార్థాలు పెట్టారు. పండుగపూట తమ ఇండ్లను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్ద పెద్ద భవనాలను వదిలి, పేదల పూరిగుడిసెలు, ఇండ్లను కూల్చివేయడం అన్యాయమంటూ ఆవేదన చెందా రు. వరుసగా పండుగల సమయంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ పాలనలో చల్లగా బతికినం
కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదని బాధితులు తెలిపారు. నోరు తెరిచి అడగకున్నా పేదల కోసం చాలా పథకాలు తీసుకువచ్చారని, పేద ప్రజలను ఏనాడూ ఇబ్బందులు పెట్టలేదని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చి తమకు కష్టం తెచ్చిందంటూ విలపించారు. కేసీఆర్ పాలనలోనే చల్లగా బతికామని, మళ్లీ కేసీఆరే రావాలని బాధిత మహిళలు వేడుకున్నారు. పేద ప్రజలపై రేవంత్‌రెడ్డి తన ప్రతాపం చూపుతున్నారని, బడాబాబులు చేసిన కబ్జాలు రేవంత్‌రెడ్డి కనిపించవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో పేదలను రోడ్డున పడేస్తున్నదని నిప్పులు చెరిగారు.
ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములివి
ఎల్లవ్వ తల్లీ.. ఓ అమ్మా.. ఎక్కడున్నవు దేవతా.. మేము ఆగమైతున్నం. మమ్మల్ని ఆగమాగం చేస్తున్నరు. రేకుల ఇండ్లలో ఉన్నం. ఉన్నది కూడా కూలగొట్టిన్రు. నా చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్న. మా నాయన పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకుంటే ఈ భూమి ఇచ్చిన్రు. అప్పట్లో ఇక్కడ ఏం లేకుండే. కంప కొట్టి ఇక్కడకు వచ్చినం. పిల్లగాళ్లు పెళ్లీడుకు వచ్చిన్రు. మేమేం చేయాలె. ఎక్కడికని పోవాలె! ఈ రేవంత్‌రెడ్డికి న్యాయమైతదా.. ఆయన బాగుపడుతడా. ఆ ఎల్లవ్వతల్లి ఆయనను చూడకపోతదా. మా ఉసురు కొట్టకతప్పదు.
-తొంట పోచమ్మ, స్థానికురాలు
పాత చెప్పుల దండ ఏస్తం
ఇందిరాగాంధీ కాలంలో మా మామలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఈ భూమి ఇచ్చిన్రు. చేయి గుర్తుకు ఓటేసినందుకు మా ఇండ్లు కూలగొట్టిన్రు. ఇక్కడే కూర్చుంటం. మాకేమై ప్రభుత్వానికే బాధ్యత. కట్టెలు పట్టుకుని నిలబడ్డరు.. ఏం చేస్తరో చూస్తం. రేవంత్‌రెడ్డికి పాతచెప్పుల దండ ఏస్తం. మేము కబ్జా చేసినంటున్నరు కదా.. భూముల దందా చేసేటోనికి అందరూ గట్లనే కనబడ్తరు.
-గండు మాధవి, స్థానికురాలు
మాభూములియ్యకుంటే సచ్చిపోతం
మా స్థలంలోకెళ్లి రోడ్డుకు భూమి ఇచ్చినం.. మోరీకి ఇచ్చినం. పేదోల్ల భూములను గుంజుకోవడానికి వాళ్లకేమైనా రోగమా. ఎవరికైనా ఏమైనా వచ్చినయా. మాకు కరెంట్ బిల్లు మాఫీ కాలేదు. తులం బంగారం ఇస్తామన్నడు. మహాలక్ష్మి పథకం ఏది? ఇవన్నీ ఏమొద్దు. ఆయన ఇచ్చే పథకాలకు దిక్కులేదు. మా భూములు మాకు కావాలె. రేవంత్‌రెడ్డి భూములు దందా చేసుకుని బతికేటోడు. మా భూములు మాకు ఇయ్యకపోతే సచ్చిపోతం.
-లలిత, స్థానికురాలు