హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): చెరువు రక్షణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుసరించిన బుల్డోజర్ రాజ్‌ను తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైడ్రాపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేసి తమది పారదర్శకమైన ప్రభుత్వమని నిరూపించుకోవాలని సూచించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఆయన లేఖ రాశారు.
మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని రాంనగర్లో పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రికి రాత్రే చేపట్టిన కూల్చివేతలపై ఆయన భగ్గుమన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ క్రమణలకు గురైన చెరువులు, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని తెలిపారు. ఎంపిక చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నారనే అనుమానాలు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి డేటా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.