ఓదెల/జమ్మికుంట, నవంబర్ 22: తాగు, సాగునీటి అవసరాల కోసం కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యామ్ కూల్చివేతకు గురైంది. భారీ వర్షాలు వచ్చినప్పటికీ కొట్టుకుపోని చెక్‌డ్యామ్.. ఉన్నట్టుండి ధ్వంసం కావడం ఇసుక మాఫియా పనే అంటూ ప్రచారం జరుగుతున్నది. ఎక్స్‌కవేటర్‌తో కూల్చివేశారా? జిలెటెన్స్టిక్స్తో పేల్చివేశారా? అనే సందేహం వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. 2022లో గత బీఆర్ఎస్ సర్కారు రూ.19 కోట్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల సమీపంలోని మానేరువాగుపై చెక్‌డ్యామ్ కట్టారు.
జిల్లాల విభజన సమయంలో సదరు చెక్‌డ్యామ్ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల పరిధిలోకి వెళ్లింది. ఈ చెక్‌డ్యామ్ ప్రజలకు తాగునీటితోపాటు రైతులకు సాగునీటి కష్టాలు దూరం చేసింది. శుక్రవారం సాయంత్రం వరకు బాగానే ఉన్న చెక్‌డ్యామ్ తెల్లవారేసరికి కూలిపోయింది. గతంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎల్ఎండీ నీరు విడుదల చేసినా ధ్వంసం కాని చెక్‌డ్యామ్ ఇప్పుడేలా కూలిందని రైతాంగం ఆందోళన వ్యక్తంచేస్తున్నది.
చెక్‌డ్యామ్ కూలడంతో మానేరులోని నీరంతా కిందకు వెళ్లి ఎడారిని తలపిస్తున్నది. ఇసుక కోసమే ఇసుక మాఫియా చెక్‌డ్యామ్‌ను పేల్చివేసి ఉంటారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. యాసంగికి నీటికష్టాలు తప్పేలాలేవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.