సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కదం తొక్కారు. నిన్న మొన్నటివరకు స్థానికంగా ఆందోళనలకు దిగిన రైతులు సోమవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. న్యాల్కల్ మండలంలోని డప్పూరు, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చి బైఠాయించారు. వీరి ఆందోళనకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతోపాటు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా రైతులు పెద్దపెట్టున నినదించారు. కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డగించడంతో అక్కడే బైఠాయించారు. కలెక్టరే తమవద్దకు రావాలంటూ డిమాండ్ చేశారు. రెండు గంటలకుపైగా ధర్నా కొనసాగింది. కలెక్టరేట్ ఏవో, డీఎస్పీ, ఇతర అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు కదలలేదు. దీంతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్వయంగా రైతుల వద్దకు వచ్చారు. న్యాల్కల్ మండలంలో ఫార్మాసిటీ ఏర్పాటును రద్దు చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు, రైతులు కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. భూసేకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రైతులతో మాట్లాడుతూ.. డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
న్యాల్కల్ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటుతో పెద్ద ఎత్తున రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల కాలుష్యం తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ రైతులు ఎస్పీ రూపేష్‌ను కలిసి న్యాల్కల్లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేపడతామని, అందుకు సహకరించాలని కోరారు.