నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. దళితబంధును అమలు చేసి తమను ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు నల్లగొండ నియోజకవర్గంలో 1,055 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.
నిధులను సంబంధిత శాఖకు విడుదల చేశారని, ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో.. దళితబంధు లబ్ధిదారుల గురించి కొత్త ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులంతా దళితబంధు సాధన సమితిగా ఏర్పడి ఆందోళనకు దిగారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, నిరహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం మౌనం వీడకపోవడంతో తాజాగా క్లాక్‌టవర్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రైతుబంధు సాధన సమితి అధ్యక్షుడు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగానే జరిగిందని, తమ కోసం విడుదల చేసిన నిధులను ఫ్రీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఎలాగైతే కొనసాగిస్తున్నారో దళితబంధు పథకాన్ని కూడా అలాగే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి నాయకులు బడుపుల శంకర్, అద్దంకి రవీందర్, గాదె నరసింహ, కట్టెల శివకుమార్, మామిడి రమేశ్, పోతెపాక నవీన్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.