హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మహిళలు, పీడిత వర్గాలు, అడవిబిడ్డల సామాజిక సమానత్వం కోసం బంజారాల ఆధ్యాత్మిక దైవం సంత్‌శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎంతగానో పరితపించారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. ఆయన మార్గం భావితరాలకు ఆచరణీయమని పేర్కొన్నారు. ఆదివారం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన బిడ్డలైన బంజారాల సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యత, ధార్మిక జీవనానికి ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగించి వారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు.