హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రిజర్వాయర్ల నుం చి చేపడుతున్న నీటి మళ్లింపులను బోర్డు కచ్చితంగా పర్యవేక్షించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ రమేశ్‌బాబు తాజా గా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాశారు. బోర్డు రాసిన లేఖలోని పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి అడ్డగోలుగా నీటిని మళ్లించుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. ఆ లెక్కలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం లేదని వివరించారు.
కేవలం 555 టీఎంసీలే మళ్లించామని పేర్కొంటూ 113 టీఎంసీలను లెక్కలో చూపడం లేదని తెలిపారు. కేఆర్ఎంబీ సైతం ఏపీ చెప్పిన లెక్కలనే పరిగణనలోకి తీసుకొంటున్నదని, తెలంగాణ లెక్కలను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి మళ్లించే జలాలను బోర్డు నిత్యం పర్యవేక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. వాస్తవానికి ఏపీ కోటా ఇప్పటికే అయిపోయిందని, ఆయా ప్రాజెక్టుల్లోని మిగిలిన 164 టీఎంసీలు తెలంగాణవేనని పేర్కొంటూ.. ఆ మేరకు రిలీజ్ ఆర్డర్స్ జారీ చేయాలని కోరారు. నీటి మళ్లింపులను నిలిపివేయకపోతే ఏపీపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఏపీ ఔట్లెట్లను స్వాధీనం చేసుకోవాలని రమేశ్‌బాబు డిమాండ్ చేశారు.