హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర ప్రజల కరెంట్, నీళ్ల గోస తీర్చిన మహానాయకుడు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. వృద్ధులకు ఆసరా పింఛన్లు, పేదింటి ఆడబిడ్డ పెండ్లి కోసం కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకల అందజేతతో పాటు గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చిన గొప్ప నాయకుడని చెప్పారు. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. మంగళవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి, కేసీఆర్ జన్మదిన వేడుకులు జరుపుతామని తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొ న్నారు.
కేసీఆర్ చేసిన ఉద్యమాలు, అభివృద్ధి పనుల చిత్రపటాల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి హరీశ్‌రావు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు పెద్ద ఎత్తు న హాజరుకావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలవారీగా నేతలందరూ కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు ఆలయాలు, చర్చ్‌లు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ భవన్లో వేడుకల ఏర్పాట్లను పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి తలసాని పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, కిశోర్‌గౌడ్, ముఠా జయసింహ పాల్గొన్నారు.