గోదావరిఖని, అక్టోబర్ 4: సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు 33శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్టు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. సింగరేణి కార్మికులు, సకలజనులంతా ఈ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణి లాభాలపై రేవంత్ సర్కార్ కార్మికులను నట్టేట ముంచి 50 శాతం కోత విధించి మోసం చేసిందని మండిపడ్డారు. భారీ మొత్తంలో లాభాల వాటా (33 శాతం) పంచుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్.. కార్మికులకు అందించింది మాత్రం కొంతేనని పేర్కొన్నారు. కార్మికుల కష్టానికి గుర్తింపుగా నికర లాభాల నుంచి కార్మికులకు వాటాను అందించింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2014-15లోనే 21శాతం, 2022-23లో 32శాతం లాభాల వాటా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.