అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు పత్తి రైతుపై పగబట్టినట్టే వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే వానలతో ఆగమైన రైతును అనేక ఆంక్షలు, అక్కరకురాని కొర్రీలతో దగా చేస్తున్నాయి. కడుపు మండిన రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కు తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారి ముట్టడి విజయవంత మైంది. వందలాదిగా తరలివచ్చిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదిలాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అఖిలపక్షం నాయకులతోపాటు రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బీఆర్ఎస్తోపాటు పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ‘పీఎం ఝాటా, సీఎం ఝూటా.. దోనే మిల్కే కాస్త్కార్కో లూటా’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. మద్దతు ధరతో పంటలను కొనాల్సి ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు, షరతులు విధించిన కారణంగా రైతులు విక్రయించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ విధానంలో పత్తిని కొంటున్న సీసీఐ.. తేమ ఎక్కువ ఉన్నదనే సాకుతో కొనడం లేదని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తే తక్కువకే కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సోయా నిబంధనల కారణంగా రైతుల వేలిముద్రలు పడటం లేదని ఓటీపీ విధానం అమలు చేయకపోవడం రైతుల మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో పంటను మద్దతు ధరతో విక్రయించుకునే పరిస్థితులు లేవని తెలిపారు. ఈ సదర్భంగా మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు రైతు సంఘాల నాయకులు, రైతులు రోడ్డుపైనే జొన్న రొట్టెలు తిని నిరసన తెలిపారు.

కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. పత్తి, సోయా పంటల కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం విజయవంతమైందని అన్నారు. రెండు ప్రభుత్వాలను కదిలించేలా ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. తేమ నిబంధనల పేరిట సీసీఐ పత్తిని కొనడం లేదని, అయితే స్థానిక బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు, అఖిలపక్షం ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. బడాభాయ్, చోటే భాయ్‌లు కలిసి రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీసీఐకి అమ్మినా మద్దతు ధర రాలే..
నేను ఆదిలాబాద్ మార్కెట్‌కు పత్తిని విక్రయించేందుకు తీసుకుపోయిన. తేమ ఎక్కువ ఉందని సీసీఐ సిబ్బంది కొనలేదు. మార్కెట్‌యార్డులో పంటను ఆరబెట్టిన. మరుసటి రోజు పంటను సీసీఐ పంటను కొనుగోలు చేసింది. తేమ అధికంగాఉందని తక్కువ ధర ఇచ్చారు. రైతులు నష్టపోకుండా మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8110కు పంటను కొంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా మార్కెట్‌యార్డుల్లో మాత్రం ఆ ధర రావడం లేదు.
– కాంతారావు, రైతు, తర్నం, భోరజ్ మండలం