హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఒత్తిడికి కేంద్రంలోని బీజేపీ సర్కారు మరోసారి తలొగ్గిందా? ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించిందా? ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగకుండా బీఆర్ఎస్ చేసిన పోరాటంతో మోదీ సర్కారు దిగొచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టనున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోరాటంతో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టంగా మార్చింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై దిగొచ్చినట్టు తెలిసింది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని తెలంగాణ ఉద్యమం సమయం నుంచే బీఆర్ఎస్ పోరాడుతున్నది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రంతో తేల్చుకొనేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు 2017 మార్చి 5న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు లేఖలు రాశారు. 2018 మార్చి 14న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఇబ్బందులు ఉండటంతో అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని వెంటపెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ ఇచ్చారు. అప్పటికే రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం ఆమోదించారు. ఎస్సీల రిజర్వేషన్ కోటాను పెంచాలని, కుల గణన కూడా చేపట్టాలని 2021 అక్టోబర్ 5న అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ కోటాను 15 శాతానికి మించి పెంచాలని కోరారు.