అర్వపల్లి/బేల, నవంబర్ 6 : దిగుబడులు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టొద్దంటూ సూర్యాపేట జిల్లా అడివెంల క్రాస్ రోడ్డు వద్ద, ఆదిలాబాద్ జిల్లా బేలలో రైతులు రాస్తారోకో చేపట్టారు. గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కుంచమర్తి గ్రామానికి చెందిన రైతులు.. ఆడివెంల క్రాసు రోడ్డు వద్ద జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి గంట సేపు ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా కాంటాలు త్వరగా వేయకపోవడంతో ధాన్యం మొలకెత్తుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రైసు మిల్లుల్లో క్వింటాకు 5 కిలోల ధాన్యం కోత విధిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసి, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. కాగా ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై సోయా రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఉదయం గంటన్నరపాటు ధర్నా చేయగా.. ఇరువైపులా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ధర్నాకు బేల మండల బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రఘునాథ్‌రావు, ఎస్సై ప్రవీణ్ అక్కడికి చేరుకొని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిషరించేలా కృషి చేస్తానని తహసీల్దార్ హామీతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజులపాటు తేమ శాతం ఎకువ కనిపిస్తున్నదనే ఉద్దేశంతో మారెట్ అధికారులు సోయా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. మారెట్ అధికారులు, కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని కొనుగోళ్లు చేపట్టాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.