Kolkata Doctor Case | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కోల్‌కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన హత్యాచార ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగా స్పందించి, సత్వర న్యాయం చేయాలని వైద్యవిద్యార్థులు డిమాండ్ చేశారు. మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో భారీ ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కోల్‌కతా ఘటనను, తెలంగాణలో జరిగిన దిశ ఘటనను పోల్చారు. వెటర్నరీ డాక్టర్(దిశ) హత్యాచార ఘటనపై కేసీఆర్ ప్రభుత్వం వేగంగా స్పందించిందని, నిందితులను ఎన్కౌంటర్ చేసిందని గుర్తుచేశారు. ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైదరాబాద్ ఘటనను ఉదాహరణగా తీసుకోవాలి. ఆ డాక్టర్ ఘటనలో కేసీఆర్ ప్రభుత్వం పదిరోజుల్లోనే బాధిత కుటుంబానికి న్యాయం చేశారు. ఇదే తరహాలో కోల్‌కతా ఘటనలోనూ న్యాయం జరగాలి’ అని సందీప్ అనే వైద్యవిద్యార్థి డిమాండ్ చేశారు. ‘దుర్గామాత కొలువై ఉన్న పశ్చిమబెంగాల్లో మహిళలపై హత్యాచారాలు జరగడం సిగ్గుచేటు. తెలంగాణలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినవారిని కేసీఆర్ ప్రభుత్వం శిక్షించింది. ఇదే తరహాలో డాక్టర్ మౌమిత కుటుంబానికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేస్తాం’ అని సుమిత్ హెచ్చరించారు.
ఆఫ్రికా బీళ్లలో ఇక్రిశాట్ పసిడి పంటలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): అధిక ఉష్ణోగ్రతలు, నీటి వనరుల లేమితో వ్యవసాయానికి అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉండే ఆఫ్రికా ఖండంలో ఇక్రిశాట్ అద్భుతాలను సృష్టిస్తున్నది. అధునాతన వ్యవసాయ సాంకేతికతను ఉపయోగించి అక్కడి బీడు భూముల్లో పసిడి పంటలు పండిస్తున్నది. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న, బీన్స్, సజ్జ, జొన్న, కంది, పెసర వంగడాలను అందుబాటులోకి తేవడంతోపాటు భూ సారం పెంపు, పంట మార్పిడి విధానాలతో రైతుల బలవన్మరణాలకు అడ్డుకట్ట వేస్తున్నది. కెన్యా, జింబాబ్వే, సెనెగల్, నైజీరియా దేశాల్లో 1.20 లక్షలకుపైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.