హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలైనా ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అద్భుతంగా పని చేసిన గురుకులాలను ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులాల్లో మరణించిన విద్యార్థులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని విన్నవించారు.
అలాగే యూనివర్సిటీలలోని ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టంచేశారు. సరూర్‌నగర్ యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విద్యా భరోసాను, నిరుద్యోగ భృతిని అమలుచేయాలని కోరారు. అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్లో విద్యా కోసం 15 శాతం నిధులు కేటాయించాలని కోరారు. నిరసనలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్‌గౌడ్‌తోపాటు పెద్దమ్మ రమేశ్, బూరుగు నవీన్‌గౌడ్, మేకల రవి, జీడీ అనిల్, శశిపాల్, సుధీర్, రాజేశ్ నాయక్, నాగారం ప్రశాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.