సీఎం రేవంత్‌రెడ్డి తన పుట్టిన రోజున తండ్రి వయసున్న, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ను ఉద్దేశించి నీచంగా మాట్లాడడం విడ్డూరం. ఈ మాటలు రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనం..రేవంత్ తీరు కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు ఉన్నది.. కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోని రేవంత్‌రెడ్డిలా మాట్లాడే ముఖ్యమంత్రి ఈ దేశంలో మరెవరూ లేరు.. మూసీ నీటితో కడిగినా రేవంత్ నోటి మురికి పోదు. వంకర బుద్ధి మారదు.
– హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తే తమ నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని.. ఇదేం దుర్మార్గమని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయటమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రజాసంఘాల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. సర్కారు చర్యలను తీవ్రంగా ఆక్షేపించింది. అరెస్ట్ చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సహా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారీ తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హకును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలో వైఫల్యంపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.
మూసీ నీటితో కడిగినా నీ నోటి మురికి పోదు : హరీశ్‌రావు
‘సీఎం రేవంత్‌రెడ్డి తన పుట్టిన రోజున తండ్రి వయసున్న, తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ను ఉద్దేశించి నీచంగా మాట్లాడడం విడ్డూరం. ఈ మాటలు రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘రేవంత్ తీరు కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినట్టు ఉన్నది’ అంటూ ఎక్స్‌వేదికగా దుయ్యబట్టారు. కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోని రేవంత్‌రెడ్డిలా మాట్లాడే ముఖ్యమంత్రి ఈ దేశంలో మరెవరూ లేరని ఎద్దేవాచేశారు. ‘మూసీ నీటితో కడిగినా నీ నోటి మురికి పోదు. నీ వంకర బుద్ధి మారదు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘బ్యాగులు మోసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చరిత్ర నీదైతే.. పోరాడి సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన చరిత్ర మాది’ అని పేర్కొన్నారు. రేవంత్ దోపిడీని, దొంగబుద్ధిని నిరూపించి ప్రజాక్షేత్రంలోనే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. కనీసం సీఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజునైనా రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగిస్తారని భావించామని, దురదృష్టవశాత్తు ఆ రోజూ కూడా నిర్బంధకాండను ఆపలేదని దుయ్యట్టారు. సీఎం మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలను తీవ్రంగా ఖండించారు. ‘రేవంత్ మూసీ పాదయాత్ర.. హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉన్నది’ అని విమర్శించారు. మూసీ మురికి కూపంలా మారడానికి 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా? అని ప్రశ్నించారు. ‘పాదయాత్ర కాదు.. పాప పరిహారయాత్ర చేసినా కాంగ్రెస్ పాపం పోదు’ అని నిప్పులు చెరిగారు. ఒక దగ్గర పేదల గూడు కూల్చి.. మరో దగ్గర నీళ్లు ఇస్తామని పాదయాత్ర చేస్తారా? అని మండిపడ్డారు. హైదరాబాదులో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర ఎలా చేస్తారని నిలదీశారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ నుంచే పాదయాత్ర ప్రారంభించాలని సవాల్ విసిరారు.
తిట్టి గొప్పోన్ని కావాలనుకోవడం మూర్ఖత్వం : దేవిప్రసాద్
చంద్రబాబు బ్యాగు లు మోసిన రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల మాజీ చైర్మన్ దేవిప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌ను తిట్టి గొప్పోళ్లం కావాలనుకోవడం మూర్ఖత్వమని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డికి పోరాటయోధుడి గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకనే ప్రశ్నించిన కేటీఆర్, హరీశ్‌రావుపై ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు.
రేవంత్ నోటిని శుద్ధి చేయాలి : మేడె రాజీవ్‌సాగర్
మూసీ ప్రక్షాళన కంటే ముందు రేవంత్ నోటిని శుద్ధి చేయాలని ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ విమర్శించారు. కేసీఆర్‌పై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. పాలన చేతకాకనే కేసీఆర్‌ను తిడుతూ కాలం వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన 11 నెలల్లో ఒక్క హామీ అమలు చేయలేని సీఎం.. ఆ సీటు పరువు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్‌లో కాకుండా నల్లగొండలో ఎందుకు పాదయాత్ర?.. హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తే మూసీ బాధితులు తరమికొడతారని భయమా?’ అని నిలదీశారు.
సీఎం పుట్టిన రోజునా నిర్బంధాలా ? : వేముల
సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన రోజునా నిర్బంధాలు విధిస్తూ పాదయాత్ర చేయటం సిగ్గుచేటని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం పాదయాత్ర షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలీసులు దొరికినవారిని దొరికినట్టు అదుపులోకి తీసుకోవడం.. అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. హైడ్రాపేరుతో హైదరాబాద్‌లో కూలగొట్టి.. నల్లగొండలో పాదయాత్ర చేయటం అంటే పుండొకచోట ఉంటే మందొకచోట వేయటం కాదా? అని ప్రశ్నించారు. నల్లగొండలో రైతు పేరు చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎన్ని పాదయాత్రలు, మోకాళ్ల యాత్రలు చేసినా, ఆఖరికి పొర్లు దండాలు పెట్టినా మూసీ పేరిట చేస్తున్న లక్షన్నర కోట్ల దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. ప్రశ్నించే గొంతులమని గొప్పలు చెప్పుకొన్న కోదండరాం, తీన్మార్ మల్లన్న, రవి, ఆకునూరి మురళి సహా అనేక గొంతులు ఇప్పుడు ఏవని ప్రశ్నించారు.
మోకాళ్ల యాత్ర చెయ్ : రాకేశ్‌రెడ్డి
‘సీఎం రేవంత్మూసీ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేయాలి’ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి హితవు పలికారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని మాట తప్పినందుకు ప్రాయశ్చిత్ర యాత్ర చేయాలని పేర్కొన్నారు. రాజ్యాన్ని పాలించే రాజు దేవుడిపై ఒట్టేసి మాట తప్పితే ఆ ప్రభావం ప్రజలపై పడుతుందని శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మూసీ పుట్టిన వికారాబాద్‌లో నివాసాలు ధ్వంసం చేసి వలిగొండలో పాదయాత్ర చేయడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
మూసీ మురికి కూపంలా మారడానికి 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా?.. పాదయాత్ర కాదు.. పాప పరిహారయాత్ర చేసినా కాంగ్రెస్ పాపం పోదు. ఒక దగ్గర పేదల గూడు కూల్చి.. మరో దగ్గర నీళ్లిస్తామని పాదయాత్ర చేస్తారా?.. దమ్ముంటే రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచే పాదయాత్ర చేయాలి.
– హరీశ్‌రావు