హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హైదరాబాద్ మహా నగరంలో సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేలా కనిపిస్తున్నది. ముఖ్యంగా ‘క్యూర్’ పరిధిలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర జనాభాలో మూడింట ఒకవంతు రాజధాని ప్రాంతంలో నివసిస్తుండగా, రానున్న రోజుల్లో ఇక్కడి అసెంబ్లీ సీట్లు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం ముఖ్య పాత్ర పోషించనున్నది. క్యూర్ జోన్లో ఉన్న ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 39,43,323 జనాభా ఉన్నది. ఈ మేరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగి, సంఖ్య 22కు చేరుకుంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 52,96,741 జనాభా ఉన్నది. అదనంగా తొమ్మిది స్థానాలు చేరి, మొత్తం సంఖ్య 23కు చేరుకుంటుంది. ఇలా ఈ రెండు జిల్లాల్లో కలిపి 45 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయి. అంటే రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల్లో పావువంతు ఇక్కడే ఉండనున్నాయి. క్యూర్ను (అవుటర్ లోపల) పరిగణనలోనికి తీసుకుంటే హైదరాబాద్ మహానగర ప్రాంతంలోని అసెంబ్లీ సీట్ల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై గణనీయంగా ఉండనున్నది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా 92,40,064గా ఉన్నది. ఇక్కడ అసెంబ్లీ సీట్లు 29 నుంచి 45కు పెరుగుతాయి. దీంతో ఒక్కో నియోజకవర్గంలో జనాభా సగటున 2.05లక్షలుగా నమోదు కానున్నది. వాస్తవానికి 2011 తర్వాత హైదరాబాద్ మహా నగరం గణనీయంగా విస్తరించింది. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ మౌలిక వసతులతో శరవేగంగా పట్టణీకరణ జరిగింది. ఎల్లలులేని అభివృద్ధి ఫలితంగా జనాభా అంతకంతకూ పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుండటంతో సాంకేతికంగా ఒక్కో నియోజకవర్గంలో జనాభా 2.05 లక్షలే అయినా, వాస్తవంలో రెట్టింపునకు పైగా ఉండనున్నది. అంటే ఓటర్ల సంఖ్య 3-4 లక్షల మధ్య ఉంటారు.
ఉదాహరణకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 2011 గణాంకాల ప్రకారం 1,53,364 జనాభా ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 7,32,506గా ఉన్నది. అంటే జనాభా కన్నా ఓటర్ల సంఖ్య సుమారు 6 లక్షలు అధికంగా ఉండటం గమనార్హం. దీంతో పునర్విభజనలోని సగటు జనాభా కన్నా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండనుండటం ఆసక్తికర అంశం. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లోని ప్రస్తుత జనాభా, ఓటర్లు 2011 సమయంలో అత్యధికంగా ఇతర జిల్లాల్లో (గ్రామీణ) ఉన్నవాళ్లు. అంటే సాంకేతికంగా 2011 జనాభా లెక్కల ప్రకారం వాళ్లంతా పల్లె పౌరులు. పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో స్థిరపడటంతో ఆ పల్లె పౌరులు ఇప్పుడు పట్టణ ఓటరుగా మారడం మరో ఆసక్తికర అంశం.