హైదరాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు దక్కకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదా? హడావుడిగా చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజనతో బీసీలకు సమీప భవిష్యత్తులో చట్టసభల్లో రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నదా? ఇందులో భాగంగానే డీలిమిటేషన్‌కు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటున్నదా? 2026 జనాభా గణనలో భాగంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేలితే, దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాటం చేస్తారని భావిస్తున్నదా? ఇదే జరిగితే అసలుకే మోసం వస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? అందుకే ఆందోళనలకు, వివాదాలకు చోటివ్వకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ను చేస్తున్నదా?, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీసీల్లో జరుగుతున్న చర్చ ఇది.
వీటికి రాజకీయ, రాజ్యాంగ నిపుణుల నుంచి ‘అవును’ అనే సమాధానం వస్తున్నది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నది. అయితే మహిళా రిజర్వేషన్లను అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నా, డీలిమిటేషన్‌పై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనకు 2026 జనాభా, కులగణన లెక్కలను కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించడమే ఇందుకు కారణం. కేంద్రం సైతం ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీసీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నారీశక్తి వందన అభియాన్ పేరుతో బిల్లును ఆమోదింపజేసింది. ఇందుకోసం 2023లోనే 106వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ సందర్భంగా ‘2027 జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేసిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి’ అనే షరతును కూడా విధించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆ షరతును పక్కనబెట్టి, 2011 జనాభా లెక్క ల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను చే యాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ ఆలోచన వెనుక కేంద్ర ప్రభుత్వాన్ని ‘బీసీ రాజకీయ రిజర్వేషన్ల’ భయం వెంటాడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ‘మేమెం తో.. మాకంత’ నినాదంతో వారు పోరాటం చేస్తున్నారు. కోర్టులను సైతం ఆశ్రయించారు. అయితే వారి జనా భా లెక్కలపై స్పష్టత లేకపోవడంతో పోరాటం ఫలించలేదు. ఈ ఏడాది నిర్వహించనున్న జనాభా గణనలో భాగంగా కులగణన కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో పక్కాగా లెక్క తేలనున్నది. ఆ లెక్కల ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు సాధించుకోవచ్చని బీసీలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 60-70శాతం వరకు బీసీలు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. జనగణన పూర్తయిన తర్వాత కులాల లెక్కలు తేలితే, తమ కోటా కోసం ఉద్య మం చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో మెజారిటీ సీట్లు బీసీలకు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలు పోరాటం మొదలుపెడితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుందని, వివాదానికి దారితీస్తుందని కేంద్ర పెద్దలు ఆందోళన వ్యక్తంచేసినట్టు చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వివాదం నుంచి తప్పించుకొనేందుకు 2011 జనాభా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే తమకు కూడా చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం బీసీలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. దేశంలో 1935 తర్వాత మళ్లీ కులగణన చేయకపోవడం వారి డిమాండ్‌కు అడ్డంకిగా మారింది. 2011లో జనాభాగణన మాత్రమే చేశారు. కులగణనకు తావులేదు. దీంతో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే 2026 జనగణనలో కులగణన కూడా చేస్తుండడంతో ఇన్నాళ్లకు తమ డిమాండ్ నెరవేరుతున్నదని బీసీలు సంతోషంలో ఉన్నారు. అయితే ఆ సంతోషంపై కేంద్రం నీళ్లు చల్లిందనే విమర్శలు వస్తున్నాయి.
కేంద్రం నిర్ణయంతో బీసీలు మరో దశాబ్దం వరకు రాజకీయ రిజర్వేషన్ల కోసం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం మరో పదేండ్లకు జనగణన జరుగుతుంది. అయితే అప్పుడు కులగణన చేస్తారో లేదో, సీట్ల పెంపు ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ చేసినా, అప్పటి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే రిజర్వేషన్లు వస్తాయి, లేదంటే మరోమారు ఎదురుచూపులు తప్పవు. ఈ నేపథ్యంలో చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించాలనే బీసీల కల కలగానే మిగిలిపోతుందా? అని ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న ద్రోహం తరతరాలను రాజకీయాలకు దూరం చేసేలా ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.