హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్ పడిన నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు ఆగిపోయినట్టేనా? కొత్త జనాభా లెక్కలపై సమగ్ర నివేదిక వచ్చిన తరువాతే మహిళా రిజర్వేషన్లు కొలిక్కి వస్తాయా? జనాభా లెకల సేకరణ, క్రోడీకరణ, తుది నోటిఫికేషన్, డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు, ఆ కమిటీ నివేదిక, అంతిమంగా నియోజకవర్గాల పునర్విభజన తంతు పూర్తి కావడానికి 2031 వరకు ఆగాల్సిందేనా? అప్పటి దాకా పాత డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు లేనట్టేనా? అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్ర కార్మిక, ఉపాధి, ఎంఎస్ఎంఈ శాఖల సహాయ మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలను బట్టి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన ‘నారీశక్తి వందన అభినయం-2023’ ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం ఇప్పటికే ఖరారైంది.
అయితే, ఈ సవరణ ఆమోదించినప్పుడు జనగణన-2027 ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పూర్తి చేశాకే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయనే షరతు పెట్టారు. ఆ షరతును తొలగించడం కోసమే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని భావించింది. అయితే, బిల్లు లోకసభలో వీగిపోవడంతో అనివార్యంగా కొత్త జనాభా లెక్కల ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, తొలి దశ జనగణన ఇప్పటికే మొదలైంది. దేశవ్యాప్తంగా ఇది కొనసాగుతున్నది. రెండో దశ ప్రక్రియ ఫిబ్రవరి 2027లో ప్రారంభమై, మార్చి 31 నాటికి ముగుస్తుంది. ఈ రెండు నెలల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి జనాభా లెక్కలు సేకరిస్తారు.
జనాభా సేకరణ ముగిసిన అనంతరం క్రోడీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో క్రోడీకరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. 2028 మార్చి నాటికి దేశ జనాభా తాతాలిక లెక్కలు అందుబాటులోకి వస్తాయని, 2028 చివరి నాటికి సమగ్ర జనాభా లెక్కలను పబ్లిక్ డొమైన్లో పెట్టే అవకాశం ఉన్నదని కేంద్ర హోంశాఖ అంచనా వేస్తున్నది. అంతిమంగా తుది నోటిఫికేషన్ ఇచ్చి, దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కేంద్రం ముందుగా డీలిమిటేషన్ కమిషన్ను నియమించాల్సి ఉంటుంది. కమిషన్ దేశమంతా తిరిగి, రాష్ర్టాల వారీగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి పార్లమెంట్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి నివేదిక అందజేస్తుంది.
ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం రెండున్నరేండ్లు పడుతుందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. తొలిసారిగా జన గణనలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్న నేపథ్యంలో వేగం, కచ్చితత్వం ఎక్కువగా ఉంటుందని, గరిష్ఠ సమయం ఆదా అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అవుతుందని విశ్లేషకులు భావించారు. కానీ, ఆదివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే 2031 నాటికి జనాభా లెక్కలపై సమగ్రత వస్తుందని వ్యాఖ్యానించారు. జనాభా లెక్కలతోపాటు కుల గణన కూడా చేస్తున్నందున ఆ మేరకు సమయం పడుతుందని వివరించారు. ఆమె మాటలను బట్టి పూర్తిస్థాయి జనాభా లెక్కలపై 2031లోనే తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ లెక్కన 2034లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అమలయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.