హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్ల (Smart Phone) పంపిణీలో కాంగ్రెస్ సర్కారు (Congress Govt) తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ల కోసం గత జూన్ 12న టీటీఎస్సీ(తెలంగాణ టెక్నికల్ సర్వీస్ సెంటర్) ద్వారా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 38,117 స్మార్ట్ఫోన్లు సమకూర్చుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సెల్ఫోన్ల కంపెనీలకు సూచించినప్పటికీ అంతకుముందే ఓ కంపెనీకి చెందిన మోడల్‌ను ఖరారు చేసింది. ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించకుండా టెండర్ ప్రక్రియ ముగియకముందే ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మధ్యవర్తిత్వం వహించిన అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తమకు నచ్చిన ఒక కంపెనీకి అనుగుణంగా టెండర్ మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నెలల పాటు టెండర్లను పక్కనబెట్టింది. ఈ వ్యవహారం సద్దుమణగడం తో ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఆ కంపెనీకే కాంట్రాక్ట్ కట్టబెట్టినట్లు తెలుస్తున్నది. కంపెనీ బాధ్యులు కమీషన్లు ముట్టజెప్పకపోవడం వల్లే పంపిణీ ఆలస్యమవుతున్నట్లు సంబంధిత శాఖ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
సుమారు ఐదేళ్ల క్రితం అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు ఆండ్రాయిడ్ ఫోన్లు అందజేశారు. అవి పాతబడటం వల్ల పోషణ్ ట్రాకర్, ఎన్‌హెచ్‌టీఎస్(న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్) యాప్‌లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన వివరాలను నిక్షిప్తం చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో పిల్లలు, లబ్ధిదారులు(గర్భిణులు, బాలింతలు) బరువు, చిన్నారుల హాజరు, బాలామృతం వివరాలు, పోషణ్ ట్రాకర్ యాప్‌లో హాజరు, ప్రతినెలా లబ్ధిదారుల ఫేస్ క్యాప్చరింగ్, బరువు, టేక్‌హోం రేషన్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే పాత ఫోన్లు ఆ యాప్‌లకు సపోర్ట్ చేయడం లేదని, 2జీబీ డేటా ఏమాత్రం సరిపోవడం లేదని ఇక మారుమూల ప్రాంతాల్లో అయితే సిగ్నల్ సమస్య కూడా ఉన్నదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ క్యాప్చరింగ్ చాలా ఆలస్యమవుతున్నదని, కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేయడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో అంగన్వాడీ టీచర్లకు ఆండ్రాయిడ్ ఫోన్లు అందజేసింది. అవి పాతవి కావడం వల్ల పోషణ్ ట్రాకర్, ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లకు సపోర్ట్ చేయడం లేదు. దీని వల్ల లబ్ధిదారుల ఫేస్ క్యాప్చరింగ్, పిల్లల హాజరు, ప్రభుత్వ సర్వేల వివరాల నమోదు తీవ్ర ఇబ్బంది అవుతున్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో టీచర్లు వ్యక్తిగత ఫోన్లనే వినియోగించాల్సి వస్తున్నది.
– ఆడెపు వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు (మినీ)