జగిత్యాల, నవంబర్ 15, (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ డిగ్రీ కాలేజీల కరస్పాండెంట్లు, లెక్చరర్లు మరోసారి రాష్ట్ర సర్కారుపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఏండ్లుగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు రావాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ మంజూరు చేయకపోవడంతో పోరుబాట పట్టాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చి.. తీరా సీఎం అపాయింట్మెంట్ సైతం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నెలక్రితం కాలేజీలను బంద్‌చేసి నిరసనలు తెలిపితే.. మూడు నాలుగు రోజుల్లో నిధులు మంజూరు చేస్తానని హామీఇచ్చి.. ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. దీంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో 890 ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలుండగా 7లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 1.50లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. 2021-2022లో 90శాతం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కాలేజీలకు అప్పటి ప్రభుత్వం చెల్లించింది. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో 2022-2023 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు నిధులు మంజూరులో జాప్యం జరిగింది. అలాగే 2023-2024కు సైతం నిధులు పెండింగ్‌లో పడిపోయాయి.
రెండున్నరేండ్లు నిధులు రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు పూర్తిగా కుదేలు అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే 2023 ఆగస్టులో అప్పటి కేసీఆర్ సర్కార్ ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం రూ.500 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టోకెన్లు ఎస్టీవో కార్యాలయాలకు చేరి నిధులు కాలేజీల అకౌంట్లలోకి జమ అవుతాయన్న సమయంలోనే ఎన్నికల కోడ్ విడుదలైంది. దీంతో రూ.500 కోట్లు నిలిచిపోవడంతో ప్రైవేట్ కాలేజీలన్నీ ఉసూరుమన్నాయి.
ఓ వైపు కాలేజీల నిర్వహణకు చేసిన అప్పులు, వాటికి వడ్డీలు పెరిగిపోవడంతో ఇద్దరు కరస్పాండెంట్లు ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందారు. మరికొందరు కాలేజీలను తెగనమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ల యాజమాన్యం దసరా పండుగ తర్వాత మూడునాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు మూసేసి దీక్షకు దిగారు. పరిస్థితి చేయిదాటుతుండడంతో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కరస్పాండెంట్ల సంఘంతో చర్చించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు రోజుల్లో నిధులు మంజూరు చేస్తారని.. బంద్‌ను విరమించాలని కరస్పాండెంట్లు, సంఘం నాయకులకు విజ్ఞప్తి చేశారు. దీంతో కరస్పాండెంట్లు బంద్‌ను విరమించి, కాలేజీలను నిర్వహించారు. నాలుగు రోజులు అన్న గడువు నెలరోజులైనా.. కార్యరూపం దాల్చకపోవడంతో కరస్పాండెంట్లు మళ్లీ ఆలోచనలో పడిపోయారు.
నిధుల విషయంలో సీఎం మాట తప్పడంతో మరోసారి కరస్పాండెంట్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కరస్పాండెంట్ల సంఘంతోపాటు, యాజమాన్యులందరూ మంగళవారం జూమ్ మీటింగ్ నిర్వహించినట్టు సమాచారం. సమావేశంలో ప్రభుత్వంపై పోరాటం చేయాలని తీర్మానించినట్టు తెలిసింది. 17, 18న గ్రూప్-3 పరీక్షలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే హాల్‌టికెట్లు సైతం జారీ అయ్యాయి. అయితే పరీక్ష సెంటర్లలో సింహభాగం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనే ఏర్పాటు చేశారు. దీంతో గ్రూప్-3 పరీక్షలకు తమ కాలేజీలను ఇవ్వవద్దని, సంఘం తీర్మానించినట్టు తెలుస్తుంది.
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు భావిస్తున్నట్టు సమాచారం. అలాగే వారం వ్యవధిలో మరోసారి సమావేశం నిర్వహించుకొని, మూకుమ్మడిగా కాలేజీలను నిరవధికంగా మూసేసి రోడ్డెక్కాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ విషయమై టీజీపీఎస్సీ చైర్మన్‌తోపాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు పోరుబాట తప్ప మరో మార్గం లేదని, ప్రభుత్వ మొండి వైఖరే ఇక్కడి వరకు తీసుకువచ్చిందని కరస్పాండెంట్ల సంఘంలో కీలక భూమికి పోషిస్తున్న ఓ కరస్పాండెంట్ ఆవేదన వ్యక్తంచేశారు.