Telangana Assembly | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ముగ్గురూ ట్రెజరీ బెంచ్‌ల వైపు కూర్చొని కనిపించారు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరినట్లు ఎటువంటి ఆధారాలు లేని కారణంగా అనర్హత వేటు పిటిషన్‌ను కొట్టివేస్తున్నానని ప్రకటించారు. ఇప్పుడు వారు ట్రెజరీ బెంచిలపై కూర్చోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఇక ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే ట్రెజరీ బెంచీల వైపే కూర్చోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని విమర్శించారు. వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్లో డోర్స్ క్లోజ్ అయ్యాయని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశమిస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 40 శాతం ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు.