హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): ఇన్ని రోజులు యూరియా ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల పత్తి దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన ధరల పిడుగు వేసింది. గోరుచుట్ట మీద రోకలిపోటు చందంగా అసలే పంట నష్టపోయి బాధలో ఉన్న పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారింది. రానున్న రోజులు పత్తి రైతులకు గడ్డుకాలమే అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో పత్తి ధర భారీగా పడిపోయింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా పత్తికి మద్దతు ధర దక్కడం లేదు. పత్తి పంట రావడం మొదలుకాకముందే ఈ పరిస్థితి ఉంటే, పత్తి రావడం మొదలైన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45.94 లక్షల ఎకరాల్లో పత్తి సాగా కాగా, సుమారు 30 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది.
పత్తి ధర ఢమాల్!
రాష్ట్రవ్యాప్తంగా పత్తి ధర భారీగా పడిపోయింది. ఈ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. అయితే, ఎక్కడా కూడా రైతులకు ఈ ధర లభించడం లేదు. కేసముద్రంలో మంగళవారం పత్తి ధర దారుణంగా పడిపోవడం గమనార్హం. గరిష్ఠంగా రూ.7,710 పలకగా, కనిష్ఠంగా రూ.3,711 పలికింది. సగటు ధర రూ.4,255గా నమోదవుతున్నది. బుధవారం జమ్మికుంట మార్కెట్లో గరిష్ఠ ధర రూ.6,050 కాగా, కనిష్ఠ ధర రూ.5వేలు పలికింది. సగటున క్వింటాల్‌కు రూ.5,600 ధర పలికింది. ఈ లెక్కన మద్దతు ధరతో పోల్చితే రూ.2వేల నుంచి రూ.4వేలు తక్కువ ధర పలుకుతున్నది. మరికొన్ని రోజుల తర్వాత అయినా ఆశించిన ధర వస్తుందేమో అంటే ఆ ఆశలూ కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ధరలో పెరుగుదల ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ సీజన్లో పత్తి రైతులకు గడ్డుకాలం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైతు నెత్తిన.. కేంద్రం సుంకం పిడుగు
ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులకు చేతనైతే మేలు జరిగేలా చేయాలి గానీ, నష్టం జరిగేలా చేయొద్దు. కానీ, కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు తీరని నష్టం చేస్తున్నది. సుంకాల పేరిట వారి నెత్తిపై పిడుగు వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై 11% సుంకం విధించేవారు. అయితే, విదేశాల నుంచి పత్తి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తొలుత కేంద్రం ప్రకటించింది. తర్వాత దీన్ని ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పొడగించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశీయ పత్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నది. దిగుమతి సుంకం ఎత్తివేయడంతో టెక్స్టైల్ పరిశ్రమలకు దేశీయ పత్తితో పోల్చితే విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశీయ పత్తికి డిమాండ్ పడిపోయింది. డిసెంబర్ వరకు సుంకాల మినహాయింపు పొడిగించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మనదేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకే పత్తి పంట వస్తుంది. సరిగ్గా మన రైతుల పత్తి చేతికొచ్చే సమయంలోనే సుంకం ఎత్తివేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సీసీఐ కొర్రీలు లేకుండా కొనుగోలు చేస్తేనే…
అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పడిపోవడం, దిగుమతి పత్తిపై సుంకాలను ఎత్తివేయడంతో రాష్ట్రంలో పత్తి ధరలు పాతాళానికి చేరాయి. ఎలాగూ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదు కాబట్టి, ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోలుకు ముందుకొచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి పత్తి ధర క్వింటాల్‌కు కనీసం రూ.10వేలు ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8,110 దక్కినా బొటాబొటిగా పెట్టిన పెట్టుబడులైనా తిరిగి వచ్చే పరిస్థితులున్నాయని అంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో రైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మాత్రమే దిక్కుగా కనిపిస్తున్నది. సీసీఐ మన రైతుల నుంచి కొర్రీలు లేకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తే రైతులు ఈ దుస్థితి నుంచి కొంత మేర గట్టెక్కే అవకాశం ఉంటుంది.
అయితే, అక్టోబర్ రెండో వారం నుంచి పత్తి కొనుగోలుకు సీసీఐ చర్యలు చేపట్టినట్టు తెలిసింది. సీసీఐ అధికారులు ఎంతవీలైతే అంత పత్తి కొనుగోళ్లలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తేమ పేరుతో, నాసిరకం పత్తి పేరుతో, రంగు మారిందని, గింజ పొడవుగా లేదని ఇలా పలు కారణాలతో పత్తి కొనుగోలుకు నిరాకరిస్తారనే విమర్శలున్నాయి. దీంతోపాటు సీసీఐ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై సీసీఐ కేంద్రాల్లో కొర్రీలు పెట్టి రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయకుండా వారిని తిరిగి పంపిస్తారనే ఆరోపణలున్నాయి. సీసీఐ తిరస్కరించిన ఆ పత్తిని ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. అదే పత్తిని తిరిగి దొంగ ఖాతాల పేరుతో సీసీఐకి విక్రయిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. గత సీజన్లో ఈ దందా జోరుగా జరిగినట్టు ప్రభుత్వ విచారణలో తేలింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతోపాటు పలు మార్కెట్ కమిటీల కార్యదర్శులను సైతం సస్పెండ్ చేశారు. ఈ సీజన్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే రైతులకు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతున్నది.