హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలుకు పైసలు కరువయ్యాయి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోవడం, సివిల్ సైప్లె వద్ద చిల్లిగవ్వ లేకపోవడంతో నిధుల కటకట తప్పడం లేదు. అప్పు చేస్తే గానీ రైతులకు ధాన్యం పైసలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో గత్యంతరం లేనిపరిస్థితుల్లో సివిల్‌సైప్లె అప్పులవేటలో పడింది. ప్రస్తుతానికి రూ.14వేల కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది. పలు జాతీయ సంస్థలు సివిల్సైప్లెకి నేరుగా అప్పులిచ్చే పరిస్థితి లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే మార్క్‌ఫెడ్ ద్వారా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. మొత్తం రూ. 14 వేల కోట్ల అప్పు కోసం దరఖాస్తు చేసినట్టుగా తెలిసింది. ఇందులో ఇప్పటికే రూ. 5వేల కోట్లను ఎన్సీడీసీ మంజూరు చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో రూ. 5వేల కోట్ల విడుదలకు దరఖాస్తు చేసినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఈ పైసలు వస్తే గానీ రైతులకు చెల్లింపులు చేసే పరిస్థితి లేదని తెలిసింది.
ధాన్యం కొనుగోలుకు నిధుల కొరత లేదని సివిల్ సైప్లె అధికారులు చెబుతున్నా.. వాస్తవ లెక్కలు మాత్రం అధికారుల మాటలు ఉత్తవేనని చెబుతున్నాయి. సివిల్‌సైప్లె అధికారుల అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 17వ తేదీ వరకు రైతుల నుంచి రూ. 3 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు మాత్రం రూ.1500 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే ఇంకా సగం బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరో వైపు నిధుల కొరతతోనే సన్న ధాన్యం రైతులకు బోనస్ అందడం లేదు. ఇప్పటి వరకు 3 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు రైతులకు క్వింటాలుకు మద్దతు ధర రూ. 2320, బోనస్ రూ. 500 కలిపి మొత్తం రూ. 2820 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 లక్షల టన్నులకుగానూ రూ. 84.60 కోట్లు రైతులకు బోనస్ కింద చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రైతులకు రూ. 9 కోట్లు మాత్రమే చెల్లించినట్టు అధికారులు వెల్లడించారు. అంటే సన్న ధాన్యం రైతులకు ఇంకా రూ. 75.60 కోట్లు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
సివిల్సైప్లెలో గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని, ఆ అప్పులను తాము తగ్గిస్తున్నట్టుగా సివిల్‌సైప్లె మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ. 58వేల కోట్ల అప్పులుంటే.. వీటిని రూ. 47వేల కోట్లకు తగ్గించినట్టుగా తెలిపారు. ఎంతో కష్టపడి సివిల్‌సైప్లె అప్పుల భారాన్ని తగ్గిస్తున్నట్టుగా గొప్పలు చెబుతున్న మంత్రి, అధికారులు ఇప్పుడు మళ్లీ అప్పుల కోసం వెంపర్లాడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు అప్పులు తగ్గిస్తున్నామని చెబుతూనే.. మళ్లీ అప్పులు చేయడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.