హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): ధాన్యమైనా, బియ్యమైనా నష్టాలకు విక్రయించడం పౌరసరఫరాలశాఖకు అలవాటుగా మారింది. ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ.. తాజాగా మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని సైతం తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్ షాపులు, గోదాముల్లో మిగిలిపొయిన 1.4 లక్షల టన్నుల దొడ్డు బియ్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు సివిల్ సప్లయ్ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కనీస ధర కేజీ రూ. 24గా నిర్ణయించారు.
ఆర్నెళ్ల తర్వాత జ్ఞానోదయం
ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో అప్పటికే రేషన్ షాపులు, గోదాముల్లోని దొడ్డు బియ్యం నిల్వలు మిగిలిపోయాయి. సన్న బియ్యం పంపిణీ నిర్ణయానికి ముందే దొడ్డు బియ్యం నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలి. కానీ దొడ్డు బియ్యం నిల్వలు ఉండగానే… ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. ఈ విధంగా రూ.500 కోట్ల విలువైన ఆ బియ్యం ఆర్నెళ్లుగా రేషన్ షాపులు, గోదాముల్లోనే మూలుగుతున్నాయి. దీంతో ఆ బియ్యం పురుగులు పట్టి ముక్కిపోయే స్థితికి చేరుకున్నాయి. వాటిని తీసుకెళ్లాలంటూ రేషన్ డీలర్లు ఎంత మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవంలేదు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత, ఆర్నెళ్ల ఆలస్యంగా అధికారులు ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.
కనీస ధర వచ్చేనా?
ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి, రవాణాతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి కేజీకి రూ. 34 వ్యయం అవుతుందని అంచనా. అయితే సివిల్ సప్లయ్ మాత్రం దొడ్డు బియ్యం విక్రయించేందుకు కనీస ధర రూ. 24గా నిర్ణయించింది. ఈ లెక్కన ఎఫ్సీఐ చెల్లించేదానికన్నా కేజీకి రూ. 10 నష్టం వాటిల్లుతున్నది. ఈ లెక్కన టన్నుకు రూ. 10వేల చొప్పున మొత్తం 1.4 లక్షల టన్నులకు నష్టం రూ. 140 కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నది.